- పలు ప్రాంతాల్లో ఉత్తర్వులివ్వని కలెక్టర్లు
- బదిలీపై వెళ్లినా.. 3 నెలలుగా అందని వేతనాలు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు సమస్యల చట్రంలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వం అంతర్ జిల్లాలు, జిల్లాల్లో అంతర్గత బదిలీలు చేసినప్పటికీ అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ ఆయా జిల్లాల కలెక్టర్లు రిలీవింగ్ ఉత్తర్వులు ఇవ్వడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. బదిలీల ప్రక్రియ జూన్ 15తో పూర్తయినా, ఇప్పటికీ రిలీవింగ్ చేయకపోవడం వల్ల బదిలీ అయినప్పటికీ ఉపయోగం ఏమి ఉందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అన్నమయ్య, అల్లూరి సీతారామరాజు మన్యం, పాడేరు, చిత్తూరు జిల్లాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉన్నట్లు అధికారులు సైతం గుర్తించారు. ఈ విషయంపై ఉద్యోగుల తరపున సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి వినతిపత్రాలిస్తున్నప్పటికీ రిలీవింగ్ చేయడం లేదని ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఈ విషయంపై ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు వికలాంగులు, భార్యాభర్తలు, ఆరోగ్య సమస్యలు, ప్రత్యేక కారణాలు ఉన్న ఉద్యోగులను రిలీవ్ చేసినట్లు, జనరల్ ట్రాన్స్‌ఫర్ కోటాలో ఉన్నవారి విషయంలో బదిలీ అయిన ప్లేస్‌కు మరొక ఉద్యోగి ఎవరూ రాకపోతుండటంతో ఆయా జిల్లాల కలెక్టర్లు, రిలీవింగ్ ప్రక్రియకు సుముఖంగా లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందనే వాదన వినబడుతోంది. మారుమూల ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతాలకు బదిలీకి దరఖాస్తులు ఎక్కువ రాగా, ఆయా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లేందుకు సరిపడా దరఖాస్తులు రాకపోవడంతో కొన్ని సచివాలయాల్లో ఉద్యోగులు సరిపడా మిగిలే అవకాశాలు లేవని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. బదిలీల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఇకపై రిలీవింగ్ ప్రక్రియ నిలిపి వేసే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.
జూన్ 15లోగా బదిలీలు అయిన వారికి అందరిలాగా వేతనాలు వస్తుండగా, జూన్ 15 తర్వాత బదిలీలు అయి, బదిలీ చేసిన ప్రదేశంలో జాయిన్ అయిన ఉద్యోగులకు గత మూడు నెలలుగా వేతనాలు అందడం లేదని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. కటాఫ్ డేట్ అయిన తర్వాత అంటే బదిలీల ప్రక్రియ ముగిసి బ్యాన్ అమల్లోకి రావడంతో అటువంటి ఉద్యోగులకు సంబంధించిన వేతనాలు బిల్లులను ట్రెజరీల్లో ఆమోదించకుండా వాటిని వెనక్కి పంపుతున్నారని ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఆయా ఉద్యోగులకు అందరిలాగా వేతనాలు రావాలంటే జూన్ 15 తర్వాత బదిలీలైన వారికి వేతనాలివ్వాలని ప్రభుత్వం నుంచి ట్రెజరీలకు ఆదేశాలు అందితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఉద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. వేతనాలు అందని ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి నుంచి 1500 వరకు ఉన్నారు. అలాగే యాన్యువల్ ఇంక్రిమెంట్ అనేది రొటీన్ ప్రక్రియ అయినప్పటికీ, మండల స్థాయిలో ఎంపిడిఒలు, ఎస్‌ఆర్ మెయిన్‌టెన్ చేసే అధికారులు, డిడిఒలు సంతకాలు పెట్టకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు జమకావడం లేదని సచివాలయ ఉద్యోగులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇందుకు సంబంధించి స్పష్టమైన ఉత్తర్వులిచ్చినప్పటికీ ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదనే వాదన ఉద్యోగుల్లో వినబడుతోంది.










