ప్రజాశక్తి-జగ్గయ్యపేట రూరల్ : వ్యవసాయ రంగం నిలబడాలంటే రాజకీయ పార్టీలకతీతంగా రైతులు ఐక్యంగా పోరాడాలని రైతు సంఘం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ఏం వి ఆంజనేయులు రైతులకు పిలుపునిచ్చారు. మండలంలోని షేర్ మహమ్మద్ పేట గ్రామంలో కోట పుల్లయ్య ప్రాంగణము నందు శుక్రవారం జగ్గయ్య పేట మండల 4 వ రైతు సంఘం మహాసభ గడ్డిమాల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. రైతు సంఘం సభ ప్రారంభానికి ముందు రైతు సంఘం జెండాను రైతు సంఘం నాయకులు ముల్లంగి రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏం వి ఆంజనేయులు మాట్లాడుతూ భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు అప్పగించేందుకు 3 వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిందని, 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయుటకు ఢిల్లీలో రైతులు 380 రోజుల పాటు వివిధ రూపాల్లో పోరాటం చేసి 750 మంది రైతుల ప్రాణాలను పణంగా పెట్టి 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయించిన ఘనత రైతులకే దక్కిందన్నారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి 2014 నుండి 2022 వరకు భారతదేశంలో 2.74 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారనీ, తాము అధికారంలోకి వస్తే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పి పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలను రెట్టింపు చేసిందన్నారు. మోడీ ప్రభుత్వం కేంద్రంలో రైల్వేలు, పోస్టల్, బిఎస్ఎన్ఎల్, విమానాశ్రయాలు, గ్యాస్, ఆయిల్, ఎల్ఐసి, నవరత్నాలు వంటి వాటిని కారుచౌకగా ఆదాని, అంబానీలకు అప్పగిస్తుందని, రానున్న జూన్ మాసంలో జరిగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రైతులకు అనుకూలమైన చట్టాలు చేయాలని లేకపోతే మరోమారు రైతులు పోరాటాలకు సిద్ధంగా ఉన్నారన్నారు. దేశంలో 6 రాష్ట్రాల్లో మిర్చి రైతులకు నష్టం వాటిల్లిందని, రైతుల పోరాట ఫలితంగా ఎకరానికి 80 వేల చొప్పున రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని కమిషన్ చెప్పినప్పటికీ ఇంతవరకు మోడీ ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం చెల్లించక పోవడం దారుణమన్నారు. రాష్ట్ర రైతాంగాన్ని కాపాడుకోవటం కోసం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 45వ జిల్లా మహాసభలు నందిగామలో మే 6, 7 తేదీల్లో జరుగుతాయని ఈ సభల్లో రైతులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
- మహసభ 5 తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించింది.
1. బావులకు, బోర్లకు మీటర్లు పెట్టవద్దని,
2. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలుకు కంప్యూటర్ కాటాలు ఏర్పాటు చేయాలని,
3. రైతు భరోసా కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని,
4. షేర్ మహమ్మద్ పేట గ్రామ సమీపంలో రైతులకు ఇబ్బందికరంగా ఉన్నటువంటి గ్రీన్ టెక్ ఫ్యాక్టరీ నీ తొలగించాలని,
5. ఇటీవల నష్టపోయిన మిర్చి పంట రైతులకు నష్టపరిహారాన్ని అందజేయాలని
రైతు సంఘం మహా సభ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది.
- రైతు సంఘం మండల మహాసభ కార్యవర్గం ఎన్నిక
రైతు సంఘం మండల కార్యదర్శిగా కాకనబోయిన వెంకటేశ్వరరావు, రైతు సంఘం మండల అధ్యక్షులుగా జోనేబోయిన వెంకటకృష్ణారావు లతోపాటు మరో 11 మంది సభ్యులు మార్తి రమేష్, అమ్మనబోయిన నవీన్, ఆశీర్వాదం, జడ రామారావు, చుక్క యాకోబు, పి శ్రీను, షేక్ సుభాని, చల్ల వెంకటేశ్వర్లు, సిహెచ్ నాగరాజు, కే నాగరాజు, గుండెబోయిన వెంకటి లను మహసభ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం డివిజన్ నాయకులు కాకనబోయిన లింగారావు, ఐద్వా జిల్లా నాయకులు సొమోజు నాగమణి, కౌలు రైతు సంఘం మండల కార్యదర్శి దంతాల వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కోటా కృష్ణ, రైతులు మార్తి నాగేశ్వరరావు, షేక్ మీరా సాహెబ్, కె సుబ్బారావు, పాతకోటి ఏసు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.










