Nov 01,2023 00:25

ప్రజాశక్తి-అమలాపురం
జిల్లా వ్యవసాయ ఆధారిత ప్రాంతమని ప్రాథమిక రంగ సెక్టార్‌ కింద వ్యవసాయ రుణాలను ఎక్కువగా కల్పిస్తూ వ్యవసాయరంగానికి పూర్తిస్థాయిలో ఆర్థిక తోడ్పాటును అందించాలని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా బ్యాంకర్లను కోరారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశపు హాలులో బ్యాంకర్లు , సంక్షేమ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి 2023 -2024 ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబరు నెలాఖరు వరకు అందించిన పంట రుణాలు, కౌలుదారు రైతులకు సిసిఆర్సి కార్డులు కింద రుణ పరపతి కల్పన, జగనన్న తోడు ఏడవ దశ రుణాల కల్పన తీరు సాధించిన ప్రగతి, జగనన్న తోడు ఎనిమిదో దశ లక్ష్యాల నిర్దేశంపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ బ్యాంకు రుణంతో ముడిపడి ఉన్న ప్రభుత్వ పథకాల గ్రౌండింగ్లో బ్యాంకర్లు అన్ని విధాల లబ్ధిదా రులకు సహకరించాలన్నారు. ఇప్పటివరకు గత ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు వ్యవ సాయ పరంగా సంక్షేమ పథకాలకు అందించిన రుణాల కల్పనపై బ్యాంకుల వారీగా బ్యాంకుల ప్రతినిధులతో సమీక్షించారు. జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ కె.శ్యాంబాబు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక చొరవతో చేపట్టిన కౌలుదార రైతుల పైలెట్‌ ప్రాజెక్టు ద్వారా 23,897 మంది కౌలుదారులకు రూ.5.84 కోట్ల మేర పంట రుణాల కల్పించారన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న బ్యాంకులు కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద జిల్లాలోని వివిధ కార్యాలయాల సౌక ర్యార్థం సుమారు రూ.2లక్షల30 వేల వ్యయంతో ఆరు ల్యాప్‌టాప్‌లు జిల్లా కలెక్టర్‌వారికి అందించామని ఎల్‌డిఎం తెలిపారు. కార్యక్రమంలో వివిధ బ్యాంకు బ్రాంచీలకు చెందిన ప్రతిని ధులు తదితరులు పాల్గొన్నారు.