- ఖరీఫ్‌లో పంపిణీ కాని 16 వేల కోట్లు
- కౌలు రైతులకు మరీ దారుణం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : కరోనా ప్రభావంతో రైతులు ఆర్థికంగా చితికిపోయి పంటల సాగుకు పెట్టుబడులు వెతుక్కుంటున్న విషమ సమయంలోనే రాష్ట్రంలో వ్యవసాయ రుణ వితరణ బాగా తగ్గిపోయింది. ఖరీఫ్‌లో బ్యాంకులు నిర్దేశించుకున్న సాగు పరపతి లక్ష్యంలో రూ.16 వేల కోట్లు పంపిణీ చేయలేదు. నిర్ణయించిన టార్గెట్‌లో 19 శాతం మేర రైతులకు అప్పులివ్వలేదు. పంటలేసుకునే నిమిత్తం ఇచ్చే స్వల్పకాలిక రుణాల లక్ష్యంలో దాదాపు రూ.8 వేల కోట్లు (12.60 శాతం) పంపిణీ చేయలేదు. దీర్ఘకాలిక రుణాలు సైతం రూ.7 వేల కోట్ల వరకు (40 శాతం) ఇవ్వలేదు. క్రాప్ లోన్ల విషయంలో భూమిపై వాస్తవంగా శ్రమ చేసే కౌలు రైతుల పరపతి మరీ తక్కువగా ఉంది. ప్రభుత్వం కొత్తగా చట్టం తీసుకొచ్చి జారీ చేసిన పంట సాగుదారు హక్కు పత్రాల (సిసిఆర్‌సి)పై ఇచ్చిన అప్పులు నామమాత్రం. ఎపిలో లక్షలాదిగా కౌలు రైతులుండగా, సర్కారు నాలుగు లక్షల వరకు కార్డులివ్వగా, కేవలం 83,435 కార్డుదారులకు రూ.871 కోట్లిచ్చారు. మన రాష్ట్రంలో ఖరీఫ్‌లోనే అత్యధికంగా పంటలు సాగవుతాయి. అలాంటి కీలక సమయంలోనే రుణ పంపిణీ లక్ష్యాలను చేరని పరిస్థితి ఉంటే, రబీతో కూడా కలుపుకొని ఏడాది మొత్తమ్మీద వ్యవసాయ రుణాలు ఇంకా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. మరో రెండు మూడు వారాల్లో రబీ సైతం ముగుస్తున్నందున వ్యవసాయ రుణాల తగ్గుదల చర్చనీయాంశంగా మారింది.
గతం కంటే తగ్గుదల
మునుపటేడాది ఖరీఫ్‌లో మొత్తం వ్యవసాయ రుణాల లక్ష్యంలో 98 శాతం మేర పంపిణీ చేశారు. ఈ సారి 81 శాతమే ఇచ్చారు. ప్రధానంగా పంట రుణాల దగ్గరకొచ్చేసరికి ముందటి ఖరీఫ్‌లో 98.87 శాతం పంపిణీ చేయగా ఈ తడవ 87.40 శాతమే పంపిణీ చేశారు. దీర్ఘకాలిక పంట రుణాల లక్ష్యంలో మునుపటేడు 106.07 శాతం ఇవ్వగా ఈ మారు 60 శాతం ఇచ్చారు.
వారికి నామమాత్రం
కొన్నేళ్లుగా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బిసి) ఇవ్వాలనుకునే పంట రుణాల్లో పది శాతం కౌలు రైతులకు కేటాయిస్తూ వచ్చారు. గతేడాది ఆ ఆనవాయితీ తప్పింది. ఖరీఫ్, రబీ కలుపుకొని పంట రుణాల లక్ష్యం రూ.94 వేల కోట్లు కాగా కౌల్దార్లకు రూ.9,400 కోట్లు ప్రతిపాదించాల్సి ఉండగా రూ.6,500 కోట్లకు తగ్గించారు. 2021-22లో మొత్తం పంట రుణాల లక్ష్యం రూ.1.10 లక్షల కోట్లకు పెరగ్గా, కౌలు రైతులకు కేటాయింపు రూ.4,100 కోట్లకు దిగజారింది. ఖరీఫ్‌లోనే కౌలు వ్యవసాయం ఎక్కువ. పంటల సాగు విస్తీర్ణంతో పోల్చినా తీసుకున్న టార్గెట్‌లో 60 శాతం, అంటే కనీసం రూ.2,500 కోట్లివ్వాలి. మొత్తంగా ఇచ్చింది రూ.996 కోట్లు. టార్గెట్‌లో 24 శాతం. అందులోనూ సిసిఆర్‌సిలపై ఇచ్చింది రూ.871 కోట్లు. జెఎల్‌జిలకు రూ.97 కోట్లు, ఇతరులకు 28.35 కోట్లిచ్చారు.










