ప్రజాశక్తి-విజయవాడ: కృష్ణలంక 22వ డివిజన్ బ్రమరాంభపురంలోని మునిసిపల్ వ్యాయామశాలను అన్ని రకాలుగా అభివృద్ది చేసి, యువతకు అందుబాటులో ఉంచడానికి చర్యలు తీసుకోవాలని డివైఎఫ్‌ఐ నాయకులు కోరారు. ఈ మేరకు నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమం సదర్భంగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు స్థానిక డివిజన్ నాయకులతో కలిసి డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు పుప్పాల కృష్ణ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ...డివిజన్‌లోని మునిసిపల్ వ్యాయామశాలను అభివృద్ది చేయాలన్నారు. జిమ్‌లో యువతకు అవసరమైన వ్యాయామ పరికరాలు లేవన్నారు. అంతేగాక యువత జిమ్ చేసేందుకు ప్రస్తుతం ఉన్న వ్యాయామశాల సరిపోవడం లేదన్నారు. సదుపాయాలు లేకపోగా ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ.200 వసూలు చేస్తున్నారన్నారు. జిమ్‌లో ఎటువంటి పరికరాలు లేక రోజు రోజుకు తగ్గిపోతున్నారని అన్నారు. జిమ్ నిరుపయోగంగా పడిఉండటమేగాక చేసేది లేక యువత ప్రయివేటు జిమ్‌లపై ఆధారపడాల్సి వస్తోందన్నారు. ఇప్పటికయినా జిమ్‌ను అన్ని విధాలుగా అభివృద్ది చేసి, యువత వ్యాయామానికి అనుకూలంగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే నగరంలోని పాడయిపోయి, నిరుపయోగంగా ఉన్న మునిసిపల్ వ్యాయామశాలలను కూడా అభివృద్ధి చేయాలన్నారు. 20వ డివిజన్‌లోని డాక్టర్ కొడాలిపున్నయ్య ప్రసూతి వైద్యశాలలో మూడు నెలలుగా గైనకాలజిస్టు అందుబాటులో లేరన్నారు. వెంటనే ఆ పోస్టును భర్తీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు జె కొండా, బత్తుల ఉమామహేశ్వరరావు, నగర నాయకులు నోహిత్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.










