Dec 20,2022 19:59

రికార్డులను పరిశీలిస్తున్న డాక్టర్‌ వసీమ్‌ అక్రమ్‌

ప్రజాశక్తి-వాల్మీకిపురం : సకాలంలో వ్యాధినిరోధక టీకాలు వేయడం ద్వారా పిల్లలకు వ్యాధుల నుంచి రక్షణ లభించడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందని వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ జిల్లా ఎక్స్‌టర్నల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ వసీమ్‌ అక్రమ్‌ అన్నారు. మంగళవారం మండలంలోని చింతపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలకు ఏ సమయంలో టీకాలు వేయాలి, వాటి ప్రాముఖ్యత, వ్యాధుల నుంచి రక్షణ తదితర అంశాలపై వైద్య సిబ్బందికి అవగాహన కల్పించారు. అనంతరం మంచూరు, తాటిగుంటపల్లి, గండబోయనపల్లి సచివాలయాలను సందర్శించి మాతాశిశు సంరక్షణ కార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో డాక్టర్లు మానస, శ్రీవిద్య, సిహెచ్‌ఒ ఇందిరారాణి, సూపర్‌వైజర్లు సుధాకర్‌, పూర్ణమ్మ, ఎఎన్‌ఎంలు, ఆశవర్కర్లు పాల్గొన్నారు.