ప్రజాశక్తి-హిందూపురం ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బాబావలి డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం నగరంలోని అంబేద్కర్ సర్కిల్‌లో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మోకాళ్లపై అర్ధనగంగా కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వసతి గృహాల్లో ఉన్న విద్యార్థుల సమస్యలపై ప్రత్యేక సర్వే నిర్వహించి పరిష్కరించాలని ఉన్నతాధికారులకు వినతులు ఇచ్చినప్పటికీ స్పందించిన పాపానపోలేదన్నారు. కరువుకి నిలయమైన సత్యసాయి జిల్లాలో వెనకబడిన బీసీ, ఎస్టీ, ఎస్సీ కుటుంబాలకు చెందిన లక్షలాది మంది విద్యార్థులు సంక్షేమ హాస్టళ్లలో విద్యను అభ్యసిస్తున్నారన్నారు. ఒకవైపు ప్రభుత్వం పెద్దఎత్తున సంక్షేమ హాస్టళ్లను అభివృద్ధి చేస్తున్నట్టు చెబుతున్నా ఆచరణలో మాత్రం కనిపించలేదన్నారు. 2018లో ఇస్తున్న మెస్, కాస్మోటిక్ ఛార్జీలను ఇప్పటికీ ఇవ్వడమే ఇందుకు నిదర్శనమన్నారు. కరోనా అన్ని రకాల సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. దీంతో ప్రభుత్వ ఇస్తున్న ధరలకు అనుగుణంగా విద్యార్థులకు మెస్, కాస్మొటిక్‌లు అందించలేకపోతునాన్న్రారు. నాడు-నేడు పథకంతో పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని చెబుతూ పాఠశాల గోడలకు రంగులు వేసి ఇదే అభివృద్ధి అని చెబుతున్నారన్నారు. ఇప్పటికే జిల్లాలో అద్దె భవనాల్లో నడుస్తున్న సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి దౌర్భాగ్యంగా ఉందన్నారు. కొన్నింటిలో మంచినీరు, మరుగుదొడ్లు, నాణ్యమైన భోజనం లేక విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే వసతిగృహాల్లో సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు హర్షకుమార్, భగత్, నిహాల్, అభి, మహేష్, బాబా ఫక్రుద్దీన్, మహాలింగ, నందీష్, సాదికబాషా, నవీన్, కోదండరాం, లోకేష్, సూర్య, నటరాజ, గిరీష్, గణేష్, తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ సర్కిల్‌లో మోకాళ్లపై నిరసన తెలుపుతున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు










