బత్తలపల్లి : ఓ వైపు పోలీసు శాఖలో విధులు, మరోవైపు కళా రంగంలో రాణిస్తున్న హెడ్ కానిస్టేబుల్ లక్ష్మయ్యకు అరుదైన గౌరవం దక్కింది. పోలీసుగా విధులు నిర్వర్తిస్తూనే, పౌరాణిక నాటకాల్లో రాణిస్తూ విశేష ప్రతిభ కనబరిచిన లక్ష్మయ్యకు ''సిటిజన్ వెల్ఫేర్ ఫోరం, ఫ్రైడ్ ఇండియా కల్చర్'' వారు ''రంగస్థల స్టేజ్ యాక్టర్'' అవార్డు ప్రదానం చేశారు. కర్నాటకలోని హంపిలోని శ్రీకృష్ణదేవరాయ నృత్యోత్సవం వారు ఏటా మే 27వ తేదీ అవార్డులు ప్రదానం చేస్తారు. అందులో భాగంగా బత్తలపల్లి పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న లక్ష్మయ్యను ''రంగస్థల స్టేజ్ యాక్టర్'' అవార్డుకు ఎంపిక చేశారు. లక్ష్మయ్య 30 ఏళ్లుగా పౌరాణిక నాటకాల్లో రాణిస్తూ పోలీసు విధులనూ నిర్వర్తిస్తున్నారు. హరిశ్చంద్రుడు, నక్షత్రిక, వీరబాహు, సత్యకీర్తి, కాలకౌషకుడు, తదితర పాత్రల్లోపోషించినట్లు తెలిపారు. అలాగే గ్రామా ల్లో ప్రజలను జాగృతి చేయడానికి చేపట్టిన పోలీస్ జాగృతి కళాజాత, జానపద గేయాలతో పాటు పలుచోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. హంపిలో కళాకారుల కు అందజేసిన అవార్డుల కార్యక్రమానికి లక్ష్మయ్య వెళ్లకపోవడంతో తోటి కళాకారులచే ట్రస్ట్ వారు మెడల్స్, శ్రీకృష్ణదేవరాయ విగ్రహం, ప్రశంసా పత్రాలు పంపినట్లు ఆయన తెలిపారు. అవార్దు గ్రహీత లక్ష్మయ్యను పలువురు కళాకారులతో పాటు సిఐ మన్సూరుద్దీన్, ఎస్‌ఐ టీవీ శ్రీహర్ష, పోలీసులు అభినందించారు.










