- ఎంబివికె, రోటరీ క్లబ్ టైలరింగ్ శిక్షణలో విద్యా కన్నా
ప్రజాశక్తి - విజయవాడ : మహిళలు వృత్తి విద్యా నైపుణ్యం సాధించడం ద్వారా ఆర్థికంగా ఎదగవచ్చని, అంతేగాకుండా సమాజంలో జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంటుందని జన శిక్షణా సంస్థాన్ చైర్‌పర్సన్ డాక్టర్ ఎన్.విద్యా కన్నా అన్నారు. నగరంలోని ఎంబి విజ్ఞాన కేంద్రంలో రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్‌టౌన్, ఎంబివికె సంయుక్త ఆధ్వర్యాన సోమవారం టైలరింగ్ శిక్షణ 4వ బ్యాచ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో విద్యాకన్నా మాట్లాడుతూ సమాజాభివృద్ధి అంటే సమాజంలో ఉన్న ప్రజల అభివృద్ధే అని, ఏదేశంలో అయితే మానవ వనరులు పుష్కలంగా అభివృద్ధి చెందుతాయో ఆదేశం అన్ని రంగాల్లో ముందుంటుందన్నారు. మహిళలు అనేక రంగాల్లో ముందుకు వెళ్లాలన్నారు. తమ కాళ్లపై తాము నిలబడేలా ఆర్థికంగా అభివృద్ధి చెందితే ఆ కుటుంబానికి భరోసా లభిస్తుందన్నారు. ఎంబి విజ్ఞాన కేంద్రం మేనేజింగ్ కమిటీ కార్యదర్శి పి మురళీకృష్ణ మాట్లాడుతూ సమాజంలో సగభాగంగా ఉన్న మహిళల్లో అత్యధిక మంది వంటింటికే పరిమితమవుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు తాము వివిధ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. కుట్టు శిక్షణకు సహకరిస్తున్న రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్‌టౌన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఎంబివికె మహిళా శిక్షణ విభాగం బాధ్యులు పి.విజయ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కంకిపాడు ఉషా టైలర్స్ అధినేత ఉషారాణి, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఫ్యాకల్టీ నరేంద్ర, ఎంబివికె బాధ్యులు యువి రామరాజు పాల్గొన్నారు.










