Jan 02,2023 09:48

పింఛన్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే సిద్ధారెడ్డి

           కదిరి టౌన్‌ : వృద్ధులు, వితంతువులు, వికాలాంగులకు పింఛన్‌ మొత్తాన్ని పెంచి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే డా||పివి.సిద్ధారెడ్డి పేర్కొన్నారు. ఇటీవల నూతనంగా మంజూరైన కొత్త పింఛన్లను లబ్ధిదారులకు ఆదివారం నాడు కదిరి కౌన్సిల్‌ హాల్‌లో ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి పింఛన్‌ మొత్తాన్ని పెంచారన్నారు. కదిరి మున్సిపాలిటీ పరిధిలోని 290కి పైచీలుకు నూతన పింఛన్లను ఈ నెల నుంచి మంజూరు చేసినట్లు చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా నెలకు రూ.2750 పింఛన్‌ అందిస్తున్న ఘనత వైసిపి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అర్హులందరికీ పింఛన్లను మంజూరు చేస్తామని చెప్పారు. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు కూడా కేవలం రూ.1000 మాత్రమే పింఛన్‌ ఇచ్చారన్నారు. జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత పింఛన్‌ మొత్తాన్ని రూ.2250కు పెంచారన్నారు. ప్రస్తుతం దానిని రూ.2,750కు పెంచారన్నారు. లబ్ధిదారుల సంఖ్యను కూడా పెంచుతూ పోతున్నట్లు చెప్పారు. కులం, మతం. పార్టీ చూడకుండా అర్హులందరికీ పింఛన్లను అందిస్తామన్నారు. జగన్మోహన్‌ రెడ్డి చేస్తున్న అభివద్ధి కార్యక్రమాలపై ప్రతిపక్ష టిడిపి కావాలనే బురదజల్లే విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారి మాటలను ప్రజలను నమ్మాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీహరిబాబు, మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్లు రాజశేఖర్‌ రెడ్డి, పిచ్చిలి శంకర, కౌన్సిలర్లు ఎంఎన్‌.ఫయాజ్‌, ఖాసీం, రాంప్రసాద్‌, జిలాన్‌, నౌషాద్‌, ఆవులస్వామి, ఇలాహి, బొబ్బిలి రవి, షాను, దాదాపీర్‌, కో ఆప్షన్‌ అమీర్‌తో పాటు వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.