ప్రజాశక్తి - వన్‌టౌన్
శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రిపై రెండవ శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీదేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ వేదపండితులు వివిధ వర్ణముల పూలతో అమ్మవారిని అలంకరించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి శుక్రవారం భక్తులు, యాత్రికులు పోటెత్తారు. శుక్రవారం తెల్లవారుజాము నుండే భక్తులు క్యూ లైనులో వేచి వున్నారు. శ్రావణ శుక్రవారం అందులోనూ వరలక్ష్మీ వ్రతం పూజలు కావటంతో సుమారు 60 వేల మంది వరకూ ప్రజలు దుర్గ మ్మను దర్శించుకునేందుకు తరలి రావటంతో దేవాలయ ప్రాంగణం కిటకిటలాడింది. శ్రావణ మాసం పురస్క రించుకుని భక్తుల సౌకర్యార్థం మల్లిఖార్జున మహా మండపం ఆరవ ఫ్లోర్ నందు ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహిం చనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి భ్రమరాంబ తెలిపారు.
అన్నదానానికి విరాళం అందజేత : శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి ఆలయం నందు ప్రతిరోజూ జరిగే నిత్య అన్నదానం పథకానికి మీనాక్షి నగర్, మదురై, తమిళనాడుకు చెందిన ప్రొఫెసర్ టి.ఎస్.గిరి ప్రకాష్ లక్ష రూపాయలను శుక్రవారం ఆలయ కార్య నిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబని కలిసి దేవ స్థానానికి చెక్కు రూపంలో విరాళం అందజేశారు. దాతకు ఆలయ అధికారులు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించిన అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శ్రీ అమ్మవారి ప్రసాదం శేషవస్త్రం అందజేశారు.
శ్రీ మహాలక్ష్మీ దేవస్థానంలో శ్రావణ శోభ : చిట్టినగర్‌లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో రెండవ శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రావణ శోభ సంతరించుకుంది. శ్రావణ శుక్రవారం కావటం, అందులోనూ వరలక్ష్మి వ్రతం సందర్భంగా శ్రీ మహాలక్ష్మి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. శుక్రవారం తెల్లవారు జామునుంచే భక్తులు, ముఖ్యంగా మహిళ భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానానికి తరలివచ్చి పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవస్థానం పాలకమండలి అధ్యక్షులు లింగిపిల్లి అప్పారావు, కార్యదర్శి మరుపిళ్ళ హనుమంతరావు, కోశాధికారి పిళ్ళా శ్రీనివాసరావు (పిసి) మాట్లాడుతూ శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ సభ్యులు గూడేల రామకష్ణ (ఆర్కే), ఈది ఎల్లారావు, తమ్మిన సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు.










