Jul 17,2022 22:19

  • గత సీజన్‌ జూలై మొదటి వారంలో 62,747.5 ఎకరాలు

2022-23 సీజన్‌లో 58,945 మాత్రమే
ప్రజాశక్తి-కృష్ణాప్రతినిధి
కృష్ణాడెల్టాకు నెల రోజులు ముందుగా నీరు విడుదల చేశామని ప్రభుత్వం ఆర్బాటంగా ప్రకటించింది. డెల్టాలో కీలకమైన వరి సాగు మాత్రం ఆశాజనకంగా ముందుకు సాగడం లేదు. గత సీజన్‌ జులై మొదటి వారంతో పోల్చితే ఈ సీజన్‌లో తక్కువ విస్తీర్ణంలో నాట్లు పూర్తయ్యాయి. వ్యవసాయ పనులు నెమ్మదిగా సాగడంతో డిమాండ్‌ లేక కూలి నామమాత్రంగానే దక్కుతోందని వ్యవసాయ కార్మికులు వాపోతున్నారు. జిల్లాలో 4,27,690 ఎకరాలు విస్తీర్ణంలో వరి సాగవుతుందని అంచనా. గతేడాది 4,26,120 ఎకరాల్లో సాగయ్యింది. అంచనాల కన్నా 1,570 ఎకరాలు తక్కువ విస్తీర్ణంలో సాగయ్యింది. గతేడాది జులై మొదటివారంలో 62,747.5 ఎకరాలు విస్తీర్ణంలో వరి సాగవ్వగా, ఈ ఏడాది 58,945 ఎకరాల్లో మాత్రమే అరయ్యింది. గతేడాదితో పోల్చితే 3,802.5 ఎకరాలు తక్కువ. సాగు నీరు విడుదల ప్రకటనకు మాత్రమే పరిమితం చేశారు. తర్వాత కాలువల్లో పూడిక సమస్యలు, తూడు, షట్టర్లు మరమ్మతులు చేయాల్సిన విషయాన్ని గుర్తించారు. కొన్ని కాల్వలకు జులై 15 వరకు నీటిని విడుదల చేయలేదు. దీంతో వరి నాట్లు వేగవంతం కాలేదు. మొవ్వ, ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి తదితర ప్రాంతాల్లో ఆలస్యంగా నారుమళ్లు పోస్తున్నారు.
ముమ్మరంగా వ్యవసాయ పనులు
వరి నాట్లు సమయంలోనే జిల్లాలో అత్యధిక మంది వ్యవసాయ కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. వరి నాట్లు ఒత్తిడి అధికమైతే కూలీలకు డిమాండ్‌ ఏర్పడుతోంది. ఈ సీజన్‌లో కాల్వల ఎగువ ప్రాంతాల్లోని పెనమలూరు, కంకిపాడు, పెదపారుపూడి, తోట్లవల్లూరు, పమిడిముక్కల తదితర ప్రాంతాల్లో నాట్లు పనులు జరుగుతున్నాయి. అన్ని చోట్ల ఒకే సారి ముమ్మరంగా పనులు రాకపోవడంతో ఈ సీజన్‌లో డిమాండ్‌ లేక కూలీ రేట్లులో నామమాత్రంగా కూడా పెరగలేదు. ఉయ్యూరు తదితర ప్రాంతాల్లో ఎకరం నాటుకు గత ఏడాది 14 మంది మహిళా కూలీలకు ఒకొక్కరికి రూ. 200 చొప్పున కూలి చెల్లించగా, ఈ సీజన్‌లో ఒక కూలి తగ్గించి 13 మందికి అదే కూలి చెల్లిస్తున్నారు. నారు లాగడం, నాట్లు వేయడం వంటి పనులకు కాంట్రాక్టు పద్దతుల్లో గత ఏడాది లాగే ఎకరానికి రూ. 4,200 నుంచి 4,500 వరకు చెల్లిస్తున్నారు. నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో రెక్కాడితే గానీ డొక్కాడని బడుగు జీవులు కూలీ చెల్లింపుల్లో గత ఏడాదితో పోల్చితే ఎటువంటి మార్పు లేదని వాపోతున్నారు.