వైద్య సిబ్బందితో ఆర్‌డిఒ సహాయక చర్యలు
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : గత ఏడాది జవాద్ తుపాను కారణంగా అన్నమయ్య డ్యామ్ తెగిపోవడం వలన సంభవించిన వరద విపత్తులో ప్రాణాలతోపాటు సర్వం కోల్పోయిన వరద ప్రభావిత ప్రాంతమైన ఎగువ మందపల్లెలో ప్రజలను విష జ్వరాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆ గ్రామంలో అడపాల సుబ్రహ్మణ్యం, వెంకటసుబ్బమ్మ అనే ఇద్దరు ఇప్పటికే మృతి చెందగా మరో ఆరుగురు రక్తకణాలు తగ్గిపోవడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో మరికొంత మంది విషజ్వరాల బారిన పడి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం రాజంపేట ఆర్‌డిఒ కోదండరామిరెడ్డి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ కొండయ్యతో కలిసి ఎగువ మందపల్లిలో పర్యటించి ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి రక్తం నమూనాలను సేకరించి పరీక్షించారు. పది మందికి జ్వరాలు ఉన్నట్లు తేలిందని నిర్ధారించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ కొండయ్య మాట్లాడుతూ సుబ్రహ్మణ్యం, వెంకటసుబ్బమ్మలు కిడ్నీ, మధుమేహ సమస్యలతో మృతి చెందినట్లు తెలిపారు. గ్రామంలో ఆరుగురు రక్తకణాలు తగ్గడంతో తిరుపతిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. గ్రామంలో అనారోగ్య సమస్యలు తగ్గే వరకు ప్రత్యేక వైద్య శిబిరం ద్వారా గ్రామస్తులకు వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి బాల మునిస్వామి, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ డాక్టర్ శేఖర్, వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.










