వనపర్తి : నిరుద్యోగులకు న్యాయం చేయాలని, ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల మంగళవారం దీక్ష ప్రారంభించారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు, ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసే వరకు తాను ప్రతి మంగళవారం దీక్ష చేపడతానని షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల వనపర్తి జిల్లా తాడిపర్తి గ్రామంలో కొండల్ అనే యువకుడు ఉద్యోగం రావట్లేదని మనస్తాపం చెంది, ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కొండల్ కుటుంబాన్ని పరామర్శించిన షర్మిల వనపర్తిలోనే ఈ ఉద్యోగదీక్ష చేపట్టారు. 1.91 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. ఈ దీక్షలో నిరుద్యోగులు, విద్యార్థులు, వైఎస్సార్ తెలంగాణ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొంటున్నారు.










