Apr 24,2022 01:36

- దిగుమతులే ఎక్కువ
అమరావతి : గతంలో ఎన్నడూ లేనంతా వంటనూనెల ధరలు సలసలా మండుతున్నాయి. గత రెండేళ్ల కాలంలో ఈ నూనెల రేట్లు డబుల్‌ అయ్యాయి. 110 రూపాయలుగా ఉన్న సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధర ఇప్పుడు 230 రూపాయులు అమ్ముతోంది. పామాయిల్‌, సోయాబీన్‌ ఆయిల్‌, శనగ నూనె, రైస్‌బ్రాన్‌ ఆయిల్‌ ఇలా అన్ని రేట్లు పెరిగిపోయాయి. మన నూనెల వాడకంలో 70 శాతం దిగుమతి చేసుకుంటున్నామని, ఉక్రెయిన్‌ యుద్దం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో నూనెల ధరలు పెరిగాయని, తాము చేయగలిగిందేమీ లేదని కేంద్రంలోని మోడీ సర్కార్‌ చెబుతోంది. భారత్‌ వాడుకునే 23 మెట్రిక్‌ టన్నుల నూనెల్లో 15 మెట్రిక్‌ టన్నులు విదేశాల నుంచే దిగుమతి అవుతున్నాయి. కేవలం ఎనిమిది టన్నులను మాత్రమే దేశీయంగా ఉత్పత్తి చేసుకుంటున్నాం. భారత్‌ పరిస్థితి ఎప్పుడూ ఇలాగే ఉండేదా? ఎప్పుడూ విదేశాలపైనే ఆధారపడాల్సిన స్థితా? కాదు..
 

                                                 ఒకప్పుడు స్వయం సమృద్ధి... ఇప్పుడు పరాధీనత

స్వాతంత్య్రం రాకముందు భారత్‌ వంటనూనెల మిగులు కలిగి ఉండేది. విదేశాలకు ఎగుమతి చేసేది. స్వాత్వంత్య్రం వచ్చిన తర్వాత కూడా 1980ల వరకు స్వయం సమృద్ధి దిశగానే ఉండేది. 1970 చివర్లలో కరువు కాటకాలు రావడం, ఇతర కారణాల వల్ల కొంతమొత్తంలో విదేశాలపై ఆధారపడాల్సి వచ్చింది. అయితే అప్పటి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఒక మిషన్‌లాగా వర్క్‌ చేసి తిరిగి వంటనూనె ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించింది. కేవలం నాలుగేళ్ల కాలంలోనే ఇది సాధించింది. కానీ నేటి మోడీ ప్రభుత్వం వంటనూనెల దిగుమతులను ఎక్కువగా ప్రొత్సహిస్తుంది. మోడీకి ముందు బిజెపి ప్రధాని వాజ్‌పేయి వంటనూనెల దిగుమతులపై 15 శాతం దిగుమతి పన్నును తగ్గించారు. ఆ తర్వాత మోడీ దానిని మరింత తగ్గించారు. వంటనూనెల దిగుమతులు సమస్యాత్మకంగా ఉన్నాయని తెలిసినా, ఏడాదికి పది బిలియన్‌ డాలర్ల సొమ్మును దిగుమతుల కోసం ఖర్చు చేస్తున్నామని తెలిసినా వీటిని నిరుత్సాహపరిచే పని మోడీ ప్రభుత్వం చేయలేదు. పైగా తన వ్యాపార మిత్రుడు అదానీకి లాభం జరిగేలా దిగుమతి పన్నులను తగ్గించారు. దీంతో వంటనూనెల వ్యాపారం చేసే అదానీ విల్‌మర్‌ సంస్థ కోవిడ్‌ కాలమైనప్పటికీ 2021వ సంవత్సరంలో 60 శాతం లాభాలను సాధించి దాదాపు 800 కోట్ల రూపాయలను జేబులో వేసుకుంది. గత రెండేళ్లుగా వంటనూనె ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కోవిడ్‌ తర్వాత వినియోగం పెరుగుతుందని అందరికీ తెలుసు. అది తెలిసే చైనా పెద్ద ఎత్తున వంటనూనెలను అంతర్జాతీయ మార్కెట్‌లో తక్కువ రేటులో ఉన్నప్పుడే కొనుగోలు చేసింది. మోడీ ప్రభుత్వం మాత్రం ఆ పని చేయలేదు. రేట్లు పెరుగుతున్నా చూస్తూ ఉన్నారు. అంతేకాక రాజకీయంగా తనను విబేధించిన మలేషియా ప్రధాని మహతీర్‌ మహ్మద్‌పై కక్ష తీర్చుకోవాలనే లక్ష్యంతో ఆ దేశం నుండి పామాయిల్‌ సరఫరాపై ఆంక్షలు పెట్టారు. దీంతో సరైన సప్లయి లేక రేట్లు పెరిగిపోయాయి. పొద్దున లేస్తే ఆత్మనిర్భరత అని చెప్పే ప్రధాని వంటనూనెల స్వయంసమృద్ధి కోసం ఈ ఏడేళ్లలో చేసిందేమీ లేదు. గట్టి ప్రయత్నం చేసి ఉంటే ఆయన మొదటి ఐదేళ్లలోనే వంటనూనెల దిగుమతి భారాన్ని తగ్గించేవారు. ఇది గతంలో 1985 నాటి ప్రభుత్వం చేసి చూపించింది కూడా.
 

                                                     డబ్ల్యుటిఓ ఒప్పందంతో దిగుమతుల వెల్లువ

1994 వరకు వంటనూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిలో ఉన్న భారత్‌కు అప్పటి ప్రధాని పివి నరిసింహారావు డబ్ల్యుటిఓతో ఒప్పందం చేసుకొని దిగుమతులకు అవకాశం ఇవ్వడంతో కోలుకోలేని దెబ్బ తగిలింది. అప్పట్లో 65 శాతం దిగుమతి సుంకంతో దిగుమతులకు అనుమతులు ఇచ్చారు. ఆ తర్వాత వాజ్‌పేయి 15 శాతం పన్ను తగ్గించారు. 1999లో మొత్తం అవసరాల్లో 30 శాతం దిగుమతుల ద్వారానే వచ్చేవి. ఆ తర్వాత ఆ పన్నులను మరింత తగ్గించారు. ప్రస్తుతం 35 శాతానికి తగ్గించారు. దీంతో దిగుమతులు పెరిగిపోయాయి. దీంతో భారతీయ రైతులు ఉత్పత్తి చేసిన నూనెగింజలకు డిమాండ్‌ లేకపోయింది. రైతులు నూనె గింజల ఉత్పత్తులను తగ్గించారు. స్థూలంగా చూస్తే నూనె గింజల ఉత్పత్తి కొంత పెరిగినప్పటికీ భారత్‌ అవసరాలకు తగ్గట్లుగా రైతులు ఉత్పత్తి చేయడం లేదు. వారికి సామర్ధ్యమున్నా, సారవంతమైన భూములు ఉన్నా, వాతావరణం అనుకూలిస్తున్నా ఇబ్బడిముబ్బడిగా వచ్చి పడుతున్న దిగుమతుల కారణంగా వీరికి గిట్టుబాటు రేటు దొరకడం లేదు. దీంతో సాగు చేసే వారి సంఖ్య తగ్గిపోయింది. ప్రస్తుతం హఠాత్తుగా కోవిడ్‌, ఉక్రెయిన్‌ యుద్దం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో వంటనూనెల లభ్యత తగ్గిపోయి రేట్లు భారీగా పెరిగిపోయాయి. దీంతో భారత సామాన్యులు మండుతున్న వంటనూనెల ధరల్లో సలసలా కాగిపోతున్నారు.

                                                              కేంద్ర ప్రభుత్వం ఏమి చేయాలి ?

పెరుగుతున్న వంటనూనెల ధరలను నియంత్రించేందుకు దిగుమతి సుంకాలను తగ్గిస్తే సరిపోతుందనే లెక్కలోనే మోడీ ప్రభుత్వం ఉంది. దీని వల్ల దేశ అవసరాల్లో మూడో వంతును దిగుమతి చేసుకుంటున్న అదానీ సంస్థకు మరిన్ని లాభాలు వస్తాయే తప్ప ప్రజలకు ఉపయోగం ఉండదు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సబ్సిడీ ధరలపై నూనె ప్యాకెట్‌ను రేషన్‌ షాపుల ద్వారా సప్లయి చేయించాలి. బ్లాక్‌ మార్కెట్‌కు పాల్పడే వారిపై సీరియస్‌గా చర్యలు తీసుకోవాలి. కోవిడ్‌ సమయంలో కేరళలోని వామపక్ష ప్రజాతంత్ర ప్రభుత్వం సబ్సిడీ ధరలకు నూనె ప్యాకెట్‌ను ప్రజలకు అందించింది. కేరళ నుంచి ఈ స్ఫూర్తిని పొందాలి. మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా ఆత్మ నిర్భరత అనేది కేవలం మాటల్లో కాకుండా వంటనూనెల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించేలా గట్టి చర్యలు తీసుకోవాలి

                                                                      మరింత ప్రియం..!

న్యూఢిల్లీ :త్వరలో వంట నూనెల ధరలు మరింత పెరగనున్నాయని తెలుస్తోంది. వంట నూనెల ఎగుమతులపై ఇండోనేషియా నిషేధం విధించడమే ఇందుకు ప్రధాన కారణం. ఏప్రిల్‌ 28 నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుంది. ఇండోనేసియా తాజా నిర్ణయం వల్ల ధరలు మరింత పెరగొచ్చని సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బివి మెహతా పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం ఇండోనేషియా ప్రభుత్వంతో చర్చలు జరిపి సమస్య పరిష్కారం అయ్యేలా చూడాలని సూచించారు. ఇండోనేసియా నుంచి ఏడాదికి దాదాపు 6-7 లక్షల టన్నుల పామ్‌ ఆయిల్‌ దిగుమతి అవుతోందని తెలిపారు.

                                                                                                                                                                                               (గమిడి శ్రీనివాస్‌)