Feb 10,2022 07:06

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగిన తీరు మూలంగా ఉభయ రాష్ట్రాలు నష్టపోతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పుడు కన్నీరు కార్చడం వంచనకు పరాకాష్ట. విభజన తీరుతో ఏపి, తెలంగాణ ఇప్పటికీ నష్టపోతున్నాయని, సరిగ్గా విభజన జరిగి ఉంటే రెండు రాష్ట్రాలకు సమస్యలు వచ్చేవి కావని మోడీ అన్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంటు ఆమోదించి ఎనిమిదేళ్లయింది. ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో కేంద్రంలో గద్దెనెక్కింది నరేంద్ర మోడీనే. విభజన మూలంగా తెలుగు రాష్ట్రాలకు నష్టం జరిగిందని నిజంగా గుర్తిస్తే ఆ చట్టాన్ని ఈపాటికే సరి చేయవచ్చు కదా! ఎవరు అడ్డం వచ్చారు? వారు అధికారానికి వచ్చిన వెంటనే ఏడు మండలాలను బదిలీ చేస్తూ ఆర్డినెన్స్‌ జారీ చేశారు. ఆ మాదిరిగానే చట్టంలో లోటుపాట్లుంటే వాటిని సరిదిద్దుతూ అప్పుడే సవరణలు తీసుకురావచ్చు కదా! ఆంధ్రప్రదేశ్‌కు పదేళ్ల పాటు ప్రత్యేక హోదానిస్తామని మోడీ మహాశయుడే తిరుపతి వెంకన్న సాక్షిగా హామీనిచ్చి, తరువాత మాట మార్చారెందుకు? రాజధాని అమరావతి శంకుస్థాపన సభకు విచ్చేసి పిడికెడు మట్టి, చెంబుడు నీళ్లు మన ముఖాన చల్లి పోయారు. ఢిల్లీ తలదన్నేలా ఆంధ్ర రాజధాని నిర్మిస్తామని ఎన్నికల్లో ఊదరగొట్టి అధికారానికొచ్చాక మొండి చెయ్యి చూపారు. కడప, బయ్యారం ఉక్కు పరిశ్రమల ఊసే లేదు. విశాఖ రైల్వే జోన్‌, ఖాజీపేట్‌ ఇంటిగ్రేటెడ్‌ కోచ్‌ ఫ్యాక్టరీ మాటల గారడీగానే మిగిలిపోయాయి. వెనుకబడిన ఫ్రాంతాల అభివృద్ధి ప్యాకేజి నిధులూ నిలిపివేశారు. ఉన్నత విద్యాసంస్థలకు కనీసం ప్రహరీ గోడ నిర్మాణాలు కూడా జరగని దుస్థితి. ఆర్థిక లోటు భర్తీ, పోలవరం ప్రాజెక్టుకు ముఖ్యంగా పునరావాస పునర్నిర్మాణ నిధుల కేటాయింపులకూ మొండి చెయ్యే చూపుతున్నారు. అంతర్రాష్ట్ర జల వివాదాలను పరిష్కరించవలసింది పోయి కేంద్రం వాటిని మరింత జటిలం చేస్తూ జల వనరులపై పెత్తనం చేస్తోంది. తెలుగు రాష్ట్రాలకు బిజెపి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల జాబితా అనంతం.
     విమర్శనాస్త్రాలు సంధించిన క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెసే హడావిడిగా విభజించిందని ప్రధాని అన్నారు. మరి ఆనాడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బిజెపికి ఈ విభజనలో భాగం లేదా? ఆ అమ్మనే చూస్తారా? ఈ చిన్నమ్మను మరుస్తారా? అంటూ నాటి బిజెపి పార్లమెంటరీ పార్టీ నేత తెలంగాణ ఓటర్లను వేడుకోవడం జనం మరచిపోయారనుకుంటున్నారా? 'ఒక ఓటు రెండు రాష్ట్రాలు' అన్న నినాదాన్నిచ్చి తెలుగు ప్రజల మధ్య విభజన విష బీజాలను వెదజల్లింది బిజెపి కాదా? విభజన తరువాత రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ ఓడిపోయిందని ప్రధాని ఎద్దేవా చేశారు. మరి విభజనకు సానుకూలంగా ఉన్న తెలంగాణ ప్రజలు బిజెపికి బ్రహ్మరథం పట్టారా? ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో జనం నమ్మడం లేదు కదా! నాడు కాంగ్రెస్‌ హయాంలో తలుపులు వేసి, మైకులు ఆపేశారని ఎలాంటి చర్చ లేకుండా రాష్ట్రాన్ని విభజించారంటూ ఇదేనా ప్రజాస్వామ్యం? అని ప్రధాని వాపోయారు. ఆనాడు లోక్‌సభలో కాంగ్రెస్‌ సర్కారు అంత దుర్మార్గంగా వ్యవహరిస్తే 2020 అక్టోబర్‌లో వినాశకరమైన వ్యవసాయ బిల్లులను రాజ్యసభలో ఆమోదింపజేసుకోవడానికి మోడీ సర్కారు అనుసరించిందీ ఆ విధానమే కదా! ఇదే బిజెపి మార్కు ప్రజాస్వామ్యమని మోడీ చెబుతారా?
       అన్ని విధాలా తెలుగు ప్రజలకు ద్రోహం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వమే. కాని, దానికి నాయకత్వం వహిస్తున్న పెద్దమనిషి బరి తెగించి ప్రజలను మోసగించడానికి యత్నించడం దారుణం. గడచిన ఎనిమిదేళ్లుగా తెలుగు ప్రజలకు ద్రోహం చేస్తూ ఇప్పుడు ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగిన తీరును ప్రధాని విమర్శించడం తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికే. లేదా ఆ తప్పులకు వేరేవారు కారణమని చెప్పి తప్పించుకోజూడడమే. ఈ నయవంచనను తెలుగు ప్రజలు తప్పక అర్ధం చేసుకుంటారు. బిజెపికి కీలెరిగి వాత పెడతారు. అబద్ధాలను ప్రచారం చేయడంలో గోబెల్స్‌ను ఆదర్శంగా తీసుకునే సంఘపరివార్‌ శక్తుల పట్ల ఎల్లవేళలా అప్రమత్తత అవసరం.