Mar 11,2023 22:08

కార్యక్రమంలో మాట్లాడుతున్న కర్ణాటక ఎమ్మెల్యే మంజునాథ్‌

          ప్రజాశక్తి-మడకశిర    కర్ణాటకకు వలస వెళ్లిన పట్టభద్ర ఓటర్లపై తెలుగుదేశం పార్టీ కన్నువేసింది. ఇందులో భాగంగా కర్ణాటక రాజధాని బెంగుళూరులోని నాగసంద్ర జెడిఎస్‌ కార్యాలయంలో వలస పట్టభద్ర ఓటర్లతో పెద్దఎత్తున ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అక్కడి ఎమ్మెల్యే మంజునాథ్‌తోపాటు ఆ రాష్ట్ర రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు కటకం శెట్టి ప్రభాకర్‌, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌మూర్తి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు తిప్పేస్వామి తదితరులు పాల్గొని ఓటర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 13న జరగనున్న పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న టిడిపి అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సాధారణంగా సార్వత్రిక ఎన్నికల జరిగినప్పుడు వలస ఓటర్లను ఆకర్షించడానికి అభ్యర్థులు ప్రయత్నిస్తుంటారు. అయితే స్థానిక టిడిపి నేతలు మాత్రం ఒక అడుగు ముందుకేసి పట్టభద్రుల ఎన్నికల్లో సైతం వలస ఓటర్లను రాబట్టుకోవడానికి ప్రయత్నించడమే కాకుండా రాజధాని శాసనసభ్యుడైన మంజునాథ్‌తో కలిసి ప్రచారం నిర్వహించడం చూస్తే టిడిపి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో అగలి జడ్పీటీసీ ఉమేష్‌ బెంగళూరు టిడిపి ఫోరమ్‌ యువకులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.