కటక్ (ఒడిశా) : ఆర్భాటంగా వివాహ వేడుకలు జరుగుతున్న వేళ.. పెళ్లి మండపం నుంచి వధూవరులు పరారయ్యారు. అదేంటి వధూవరులు పరారవ్వడమేంటి ? అనుకుంటున్నారా.. అవునండీ.. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసు ఇన్‌స్పెక్టరు మధుమిత మహంతి వివరాల మేరకు.... పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన వరుడికి బాలాసోర్ పట్టణానికి చెందిన యువతితో వివాహమయ్యింది. బాలాసోర్ పట్టణంలోని 16 వ నంబరు జాతీయ రహదారి పక్కన చహాపులియా చౌక్ వద్ద ఉన్న హోటల్ మంగళ నిలయంలో వీరి వివాహ వేడుక గ్రాండ్‌గా జరుగుతోంది. పెళ్లికి అనుమతి తీసుకున్నా నిబంధనల ప్రకారం... 25 మంది మాత్రమే వేడుకలో పాల్గనాలి. కానీ ఎక్కువ మంది అతిధులను పిలిచి ఆర్భాటంగా పెళ్లి చేశారు. ఇంతలో... కోవిడ్ నిబంధనలను పాటించకుండా పెళ్లి వేడుక జరుగుతుందంటూ... సోరో పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు పెళ్లి మండపంలో రంగ ప్రవేశం చేశారు. పోలీసులను చూసిన వధూవరులు హడలెత్తి అక్కడి నుండి పరారయ్యారు. వధూవరులు పారిపోవడాన్ని చూసిన అతిథులంతా నోరెళ్లబెట్టి అవాక్కయ్యారు. కరోనా నిబంధనల ఉల్లంఘన కేసు నమోదు చేసిన పోలీసులు హోటల్ యజమానికి రూ.3 వేలు, వరుడు తండ్రికి రూ.5 వేలు జరిమానా విధించారు. ఒడిశా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2 వేల నుంచి 5 వేలకు చేరింది. కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో.. కోవిడ్ నిబంధనల ఉల్లంఘనలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల ప్రారంభంలో కటక్ నగరంలోనూ కరోనా నిబంధనలు ఉల్లంఘించి పెళ్లి చేసిన నిర్వాహకులకు పోలీసులు రూ.50 వేల జరిమానాను విధించారు.










