చిలమత్తూరు : ఆశా కార్యకర్తల నియమక అంశం రోజురోజుకూ వివాదస్పదం అవుతోంది. మొరసల పల్లి పంచాయతీలో ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్త పోస్టు తమ వర్గానికి కావాలంటే తమ వర్గానికి కావాలని అధికారపార్టీలోని రెండు వర్గాలు బాహాబాహి దిగడం మండల వైద్యాధికారిపై వాదనకు దిగడం ఆయన రద్దు చేశామని ప్రకటనలు ఇవ్వడం నిత్యకృత్యంగా మారింది. ఈ నేపధ్యంలో తాజాగా కులసంఘాలు సైతం ఈ వర్గపోరులోకి ఎంట్రీ ఇచ్చాయి. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహిళ ఆశా వర్కర్ గా నియమక పత్రం పొందిన తర్వాత వైసిపి నాయకుడు అడ్డుతగిలి ఆ మహిళపై దురుసుగా ప్రవర్తించాడని ఆ వైసిపి నాయకుడితో పాటు అతనికి సహకరించిన ముగ్గురుపై మహిళ ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు ఇంతవరకు కేసు నమోదు చేయలేదని విమర్శిస్తూ రెడ్డి సంఘం నాయకులు శుక్రవారం ఆందోళనకు దిగారు. హిందూపురం కొడికొండ చెక్‌పోస్టు రోడ్డుపై కూర్చొని ఆందోళనకు దిగారు. ఫిర్యాదులో పేర్కొన్న వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఎస్‌ఐ శ్రీనివాసులు సర్దిచెప్పి మహిళకు న్యాయం చేస్తామని హామి ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఇంతలోనే మరో వర్గానికి చెందిన మొరసలపల్లి సర్పంచి, ఎంపిటీసి తమ పంచాయతీలో అన్ని కులాలు ఐక్యంగా ఉన్నాయని మొరసల పల్లి పంచాయతీకి చెందిన ఓ వ్యక్తి కులం పేరుతో రెచ్చకొడుతూ బిసిలను అవమానపరుస్తున్నారని పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేశారు. మొత్తానికి ఓ ఆశా కార్యకర్త పోస్ట్ నియామకంలో రెండు వర్గాల మధ్య మొదలైన ఆధిపత్య పోరులో ఇటు వైద్య, అటు పోలీస్ శాఖకు తలనొప్పిగా మారింది. ఇప్పటికైన వైసిపి అధిష్టానం కలుగచేసుకొని పారదర్శకంగా ఆశాకార్యకర్త పోస్టు భర్తీకి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.










