రొద్దం : మండలంలోని కంచెసముద్రం గ్రామంలో భూమి సమస్యపై వివాదం నెలకొంది. లోచర్ల గ్రామానికి చెందిన బోయ నాగలక్ష్మి తనకు ఉన్న 2.73 ఎకరాల భూమిలో ముళ్ల కంపలు తొలగించడానికి వెళ్లగా కంచెసముద్రం గ్రామస్తులు అడ్డుకొన్నారు. నాగలక్ష్మి కంచెసముద్రం గ్రామ సమీపంలో స్మశానం పక్కనే 82.2 సర్వే నంబర్లో 2-15 ఎకరాలు, 83.3 సర్వే నంబర్లో 0.58 ఎకరాలను మొత్తం 2.73 ఎకరాల భూమిని ప్రభుత్వం భూపంపిణీలో భూమిని పంపిణీ చేసింది. అయితే ఆభూమి సమీపంలోనే 7ఎకరాలకు పైగా భూమిని ప్రభుత్వం శ్మశానానికి కేటాయించింది. ఈ నేపథ్యంలో నాగలక్ష్మి తనకు ఇచ్చిన భూమిని కొలతలు వేయించుకోవటానికి అధికారుల సూచనల మేరకు కంపచెట్లను తొలగించే కార్యక్రమాన్ని ఆదివారం చేపట్టింది. అయితే శ్మశానభూమిలో చెట్లను తొలగించే కార్యక్రమం చేపడుతుందనే ఉద్దేశ్యంతో ఆ గ్రామస్తులు అడ్డుకున్నారు. భూ ఆక్రమణపై సోమవారం తహశీల్దార్‌కు ఫిర్యాదు చేస్తామని గ్రామస్తులు ఈసందర్భంగా తెలిపారు.










