వాల్మీకిపురం : సంక్షేమ పథకాలతో పాటు ప్రజోపయోగ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ విశ్వసనీయతకు మారుపేరుగా ప్రజల గుండెల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గూడుకట్టుకున్నారని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని జర్రావారిపల్లిలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం కోలాహలంగా సాగింది. ఎమ్మెల్యే చింతల.. అధికారులు, ప్రజాప్రతినిధులు, వలంటీర్లతో ఇంటింటికీ వెళ్లి మూడున్నరేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు. ఆయా కుటుంబాలకు ఏ మేరకు లబ్ధి చేకూరిందో తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతల మాట్లాడుతూ సిఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని తన సొంత కుటుంబంగా భావిస్తూ అందరి సంక్షేమం, అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు. గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే చింతల దృష్టికి ప్రజలు పలు సమస్యలు తీసుకొచ్చారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా అధికారులు చొరవ చూపి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం అటవీశాఖ ఆధ్వర్యంలో జర్రావారిపల్లి నూతన సచివాలయం వద్ద మొక్కలు నాటి, ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఎంపిడిఒ షబ్బీర్ అహ్మద్, తహశీల్దార్ ఫిరోజ్ ఖాన్, జడ్‌పిటిసి నిర్మల, అటవీశాఖ అధికారులు సుధాకర్, జ్యోతి, గిరినాథ బాబు, బాలసుబ్రమణ్యం, నాయకలు చింతల శివానంద రెడ్డి, నీళ్లభాస్కర్, కేశవ రెడ్డి, అబ్దుల్ కలీమ్, చంద్ర, ఆనంద, రాయుడు, రవి, చలపతి, విశ్వనాథం పాల్గొన్నారు.










