Jul 12,2021 20:31
కోతకు గురైన బీచ్‌ రహదారి

* ఉపరితలఆవర్తనంతో మరో రెండు రోజులు భారీ వర్షాలు
ప్రజాశక్తి-యంత్రాంగం :
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడగా రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిశాయి. తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. కృష్ణాజిల్లాలోని కైకలూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి, గుడ్లవల్లేరు, చల్లపల్లి, అవనిగడ్డ, కోడూరు మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. పామర్రు, కంచికచర్ల, నూజివీడు బస్టాండ్లు బురదమయంగా మారాయి. మచిలీపట్నం మంగిననపూడి, హంసలదీవి వద్ద బీచ్‌లలో అలల ఉధృతి తీవ్రంగా కొనసాగుతోంది. హంసలదీవి వద్ద సముద్రం వంద అడుగులు ముందుకు రావడంతో దివిసీమవాసులు భయాందోళనకు గురవుతున్నారు. బీచ్‌ రహదారి కోతకు గురైంది. బీచ్‌ దగ్గర నుంచి సాగరసంగమం వరకూ సుమారు మూడు కిలోమీటర్ల మేర మూడు అడుగుల ఎత్తు ఉన్న ఇసుక తిన్నెలు కోతకు గురయ్యాయి. కఅష్ణమ్మ పాదాలు విగ్రహం ఏర్పాటు చేసిన ప్లాట్‌ఫామ్‌ ధ్వంసమైంది. పశ్చిమగోదావరి జిల్లాలో 18.2 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. చాగల్లు, నిడదవోలు, ఉండ్రాజవరం, పెనుమంట్ర మండలాల్లో వెయ్యి ఎకరాల్లో నారుమడులు ముంపుబారిన పడినట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం, కొత్తపేట, రాజమహేంద్రవరం, కడియం, రాజానగరం, మన్యంలో రాజవొమ్మంగి, రంపచోడవరం, మారేడుమిల్లి, చింతూరులో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. చెట్ల కొమ్మలు విరిగిపడటంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాలో మోస్తరు వర్షం కురిసింది.

భారీవర్షాలకు అవకాశం
ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ ా దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఈ నెల 11న ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సోమవారం ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ఫలితంగా ఎపిలోని ఉత్తర కోస్తాలో రాగల రెండు రోజుల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీవర్షాలు, పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.