- తెలంగాణ సాయుధ పోరాట యోధ మల్లు స్వరాజ్యం కన్నుమూత
- నేడు హైదరాబాద్‌లో ఎంబి భవన్‌కు భౌతికకాయం
- ఉదయం ఆరు నుంచి తొమ్మిది వరకు ప్రజల సందర్శనార్ధం
- నల్లగొండకు తరలింపు..12 గంటలకు సంతాపసభ
- అనంతరం మెడికల్ కాలేజీకి భౌతిక కాయం అప్పగింత
ఆమె తెలుగుగడ్డపై ఎగిసిన పోరాటం! భూమికోసం, భుక్తికోసం, వెట్టిచాకిరి విముక్తికోసం ఆమె బందూకయ్యింది. పోరాటమయ్యింది. పోరాటాల అమ్మ అయ్యింది. పేదలకు తోడయ్యింది. పదకొండేళ్ల చిరుప్రాయం నుండి అలుపెరుగని పోరాటాలకు చిరునామాగా మారిన మల్లు స్వరాజ్యం ఇకలేరు. ఎర్రజెండా నీడలో ఉవ్వెత్తున సాగిన విప్లవ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మొదటిసారి బిగిసిన ఆమె పిడికిలిది చివరి వరకు అదే పట్టు! ఏ మాత్రం సడలలేదు! ఆస్పత్రిలో అంతిమ పోరాటం చేస్తున్న సమయంలోనూ తనను చూడటానికి వచ్చే వారిని బిగిసిన పిడికిలితోనే ఆమె పలకరించింది. కళ్లు మూస్తూ తెరుస్తూ ఎర్రజెండానే పలవరించింది! కొద్దిరోజల క్రితం కూడా 'ఇది రైతు భూమి.. కష్టజీవులు ఎప్పటికైనా గెలుస్తారు' అంటూ అతి కష్టంతో కాగితంపై రాసిన ధీరత్వం ఆమెది! ఇది కదా..పోరాటమంటే! ఇది కదా చావును సైతం ఎదిరించడమంటే !! ఎన్నో పోరాటాల్లో గెలిచి నిలిచిన వీరనారి మల్లు స్వరాజ్యం విశ్రమించారు! పోరుజెండాల్లో అరుణతారగా మారారు! ఆమె కనుమూశారన్న వార్త తెలుగు జాతిని తీవ్ర ఆవేదనకు గురిచేసింది. సిపిఎం, సిపిఐ అగ్రనాయకత్వంతో పాటు, వామపక్ష శ్రేణులు, అభ్యుదయ శక్తులు ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్మోహన్‌రెడ్డి, కెసిఆర్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్‌కళ్యాణ్ సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి రాఘవులు, పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితరులు సంతాపం తెలిపారు.
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, సిపిఎం సీనియర్ నేత, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం (91) ఇకలేరు. వయో భారంతోపాటు ఊపిరితిత్తుల సమస్యతో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి 7.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ప్రస్తుత సూర్యాపేట జిల్లాలోని (ఉమ్మడి నల్లగొండ) కర్విరాల కొత్తగూడెంలోని ఓ భూస్వామ్య కుటుంబంలో భీమిరెడ్డి రామిరెడ్డి, చొక్కమ్మ దంపతులకు 1931లో ఆమె జన్మించారు. ఐదారు వందల ఎకరాల భూస్వామి కుటుంబం వారిది. ఐదో తరగతి వరకే విద్యనభ్యసించారు. ఆమె అన్న భీమిరెడ్డి అడుగుజాడల్లో పోరాటపంథాలోకి వచ్చారు. 1945-48 మధ్య మహోజ్వలంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకీ చేతబట్టి ఎందరో మహిళలకు ప్రేరణగా నిలిచారు. గ్రామాల్లో పెద్దఎత్తున ప్రజలను కదిలించేలా అనేక సభలు నిర్వహించారు. ఆనాటి రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా బతుకమ్మ పాటలతో ఉర్రూతలూగించారు. తుపాకీ తూటాల్లాంటి మాటలతో మహిళలను చైతన్యపర్చడంలో కీలకపాత్ర పోషించారు. సాయుధ పోరాట కాలంలో మల్లు స్వరాజ్యంతోపాటు మూడొందల మంది మహిళలు మేజర్ జైపాల్‌సింగ్ ఆధ్వర్యంలో సాయుధ శిక్షణ పొందారు. 75 ఏండ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఆమె రెండు సార్లు 1978, 1983లో తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ నాయకురాలిగా అనేక మహిళా సమస్యలపై పోరాటాలు నిర్వహించారు.మల్లు స్వరాజ్యం భర్త మల్లు వెంకటనర్సింహ్మారెడ్డి (విఎన్) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శిగా, సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. ఆయన 2004 డిసెంబర్ నాలుగో తేదీన మరణించారు. వారికి ఒక కుమార్తె పాదూరి కరుణ, ఇద్దరు కుమారులు మల్లు గౌతంరెడ్డి (వైద్యులు), మల్లు నాగార్జునరెడ్డి (న్యాయవాది) ఉన్నారు. నాగార్జునరెడ్డి ప్రస్తుతం సీపీఐ(ఎం) సూర్యాపేట జిల్లా కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఆయన భార్య మల్లు లక్ష్మి ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
నేడు ఎంబి భవన్‌కు భౌతికకాయం
మల్లు స్వరాజ్యం భౌతికకాయం ఆదివారం ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు ప్రజల సందర్శనార్ధం హైదరాబాద్‌లోని సిపిఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో అందుబాటులో ఉంచుతారు. అనంతరం నల్లగొండ జిల్లాకు తీసుకెళ్తారు. ఆ జిల్లా పార్టీ కార్యాలయంలో ఉదయం 11 నుంచి ఒంటిగంట వరకు ప్రజల సందర్శనార్ధం ఉంచుతారు. మధ్యాహ్నం 12 గంటలకు నల్లగొండ జిల్లా కేంద్రంలో మల్లు స్వరాజ్యం సంతాప సభ నిర్వహిస్తారు. ఈ సభకు సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, సుభాషిణీఅలీ, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులతోపాటు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారు. ఆ తర్వాత అంతిమయాత్రగా బయల్దేరి మధ్యాహ్నం మూడున్నర గంటలకు మెడికల్ కాలేజీకి ఆమె పార్థీవదేహాన్ని ఆ పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు అప్పగిస్తారు.
పలువురి నివాళి
మల్లు స్వరాజ్యం మరణం పట్ల సిపిఎంతోపాటు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా, కార్మిక, ఉపాధ్యాయ సంఘాల నేతలు, రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు సంతాపం ప్రకటించారు. మల్లు స్వరాజ్యం మరణవార్త తెలియగానే సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య, పెనుమల్లి మధు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, బి వెంకట్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు, ప్రధాన కార్యదర్శి టి సాగర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి కేర్ ఆస్పత్రిని సందర్శించి ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు.
ఓ ఇంటర్వ్యూలో మల్లు స్వరాజ్యం అభిప్రాయాలు ఇవీ...
''7వ తరగతి నుంచి బాలికలకు కరాటే నేర్పాలి. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే ఆత్మస్తైర్యాన్ని కల్పించాలి. వేధింపులను అరికట్టడానికి కాలేజీల్లో ఆడ, మగ వారిని కలిపి రక్షణ కమిటీలు వేయాలి. సాధికారత కలగాలంటే ఆర్థిక పని హక్కు ఉండాలి. సామాజిక, రాజకీయ రంగాల్లో మహిళలు ఇంకా చైతన్యమై పోరాడాలి. ''
''నాకు వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమే స్ఫూర్తి. అదే నాకు సంతృప్తినిచ్చింది. మహిళా ఉద్యమాల నిర్మాణంలో నా శక్తి వంచన లేకుండా కృషిచేశాను. ఆ కృషి వల్ల వచ్చిన ఫలితాలనూ చూశాను. పేదలకు చాలా హక్కులు దక్కాయి. కింది తరగతుల వారు చదువులకు వెళ్తున్నారంటే పోరాట ఫలితమే. ఇప్పుడు అమ్మాయిల ప్రగతిని చూస్తే ఎంతో సంతోషం కలుగుతుంది. కానీ, సాధించాల్సింది చాలా ఉంది.''
''హింస లేని, స్త్రీ, పురుష సమానత్వంతో కూడిన సోషలిస్టు సమాజం ఏర్పడాలి. అలాంటి సమాజాన్ని నిర్మించుకునే బాధ్యత స్త్రీ, పురుషులు అందరిదీ. యువతరంపైనా, వామపక్షాలపైనా ఎక్కువ బాధ్యత ఉంది. అది జరిగి తీరుతుందని నమ్ముతున్నాను. ప్రజలే చరిత్రను నిర్మిస్తారు.''
నివాళులు..
కామ్రేడ్ మల్లు స్వరాజ్యం మృతి పట్ల నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. భూస్వామ్య, పెట్టుబడిదారీ దోపిడీకి వ్యతిరేకంగా స్పూర్తిదాయకమైన పోరాటాన్ని సాగించిన ధీరురాలామె.సామ్యవాద పక్షపాతి. ఐద్వా వ్యవస్థాపకుల్లో ఒకరు.మహిళా ఉద్యమ నిర్మాణానికి ఆమె చేసిన కృషి అమోఘం.ఆమె మార్గదర్శకత్వంలో పని చేయడం ఎంతో స్పూర్తినిచ్చింది.ఆమె పేదల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడారు.పార్టీలో మహిళా కామ్రేడ్లను అక్కున చేర్చుకుని ఎంతో ఆప్యాయంగా చూసేవారు. ఆమె ఆదర్శ ప్రాయమైన జీవితం ఎంతో స్పూర్తి నిచ్చింది. మన ప్రియతమ స్వరాజ్యం గారికి నివాళులర్పిస్తున్నాను. ఆమె కుటుంబ సభ్యులకు, పార్టీ కామ్రేడ్లకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
-ఐద్వా నాయకురాలు బృందా కరత్
పాటూరి తదితరుల సంతాపం
మల్లు స్వరాజ్యం మృతికి సీనియర్ నాయకులు పాటూరి రామయ్య, పుతుంబాక భారతి, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి. ఉమామహేశ్వరరావు సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు., స్వరాజ్యం మార్క్సిస్టు నిప్పు కణిక, రానున్న తరాలకు స్పూర్తి ప్రదాత అని ఆమె కొనియాడారు.










