140 మంది విద్యార్థులకు జ్వరం
గురుకుల పాఠశాలలో వైద్య శిబిరం
ప్రజాశక్తి-నందలూరు : మండలంలోని మహాత్మ జ్యోతిబాపూలే బిసి బాలికల గురుకుల పాఠశాలలో విషజ్వరాలు విజృంభించడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలో 700 మంది విద్యార్థుల్లో 140 మందికి పైగా విద్యార్థినులు ఇబ్బంది పడుతున్న సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పాఠశాల వాతావరణం అపరి శుభ్రంగా మారడంతోపాటు వంట గది, తాగునీటి ట్యాంక్ అధ్వానంగా ఉన్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మండల ప్రభుత్వ వైద్యాధికారి సృజన, తన వైద్య బృందంతో కలిసి బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. రెండు రోజుల క్రితం నాగిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన పదవ తరగతి విద్యార్థి హాసినికి తీవ్ర అస్వస్థతకు గురైంది. సృహ తప్పడంతో ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. బాలిక ఆరోగ్యం గురించి అడిగితే నిర్లక్ష్యంగా పాఠశాల ఉపాధ్యాయులు సమాధానం ఇచ్చారని బాలిక బంధువులు ఆరోపిస్తున్నారు. కేవలం ప్రిన్సిపల్, నర్స్, కొంత మంది ఉపాధ్యాయుల బాధ్యత రాహిత్యం వల్లనే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన చెందిన వారు, తమ పిల్లలను వారి వారి ఇళ్లకు తీసుకు వెళుతున్నారు. ఏది ఏమైనప్పటికీ పాఠశాలలోని అపరిశుభ్రతను తొలగించి విద్యార్థులకు అవసరమైన వైద్యంతో పాటు, సౌకర్యాలు మెరుగుపరచాలని స్థానికులు కోరుకుంటున్నారు.










