May 03,2023 20:49

రాస్తారోకో కార్యక్రమంలో సిఐటియు,

రాస్తారోకో కార్యక్రమంలో సిఐటియు,

విశాఖ ఉక్కును ప్రైవేటుపరం కానివ్వం
- సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.అజరు కుమార్‌
నెల్లూరు:రాష్ట్రంలోని ట్రేడ్‌ యూనియన్ల పిలుపు మేరకు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిఐటియు, ఏఐటీయూసీ,ఐ ఎఫ్‌ టి యు, ఏ ఐ ఎఫ్‌ టి యు( న్యూ ) వామపక్షాల ఆధ్వర్యంలో నగరంలోని ఆత్మకూరు బస్టాండ్‌ ప్రాంతంలో రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి అన్ని ట్రేడ్‌ యూనియన్లు సంయుక్తంగా ప్రదర్శన నిర్వహించాయి.అ నంతరం నిర్వహించిన రాస్తారోకో కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె అజరు కుమార్‌ మాట్లాడుతూ మూడు లక్షల కోట్ల విలువ చేసే విశాఖ ఉక్కు పరిశ్రమను బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు 9,000 కోట్లకు అమ్మాలని చేసిన నిర్ణయాన్ని తక్షణం విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు.
నాడు 32 మంది బలిదానాలతో, 62 మంది పార్లమెంటు సభ్యుల రాజీనామాలతో, 30 గ్రామాల ప్రజలు తమ వ్యవసాయ భూమిని త్యాగం చేస్తే విశాఖ ఉక్కును పోరాడి సాధించుకున్నామన్నారు. 30 వేల మందికి ప్రత్యక్షంగా, లక్ష మందికి పరోక్షంగా ఉపాధి కల్పించే నవరత్న హౌదా కలిగిన విశాఖ ఉక్కుని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కానివ్వమని కార్మిక వర్గాలు ప్రతిజ్ఞ బూనుతున్నాయన్నారు. మోడీ ప్రభుత్వం దేశ ప్రజల సంపదతో నిర్మించుకున్న ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు కారు చౌకగా అమ్మేస్తూ నకిలీ దేశభక్తిని ప్రచారం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలలో 13 లక్షల పోస్టులు ఖాళీలు ఉండగా, ఉద్యోగాల కోసం ఎదురుచూసే చదువుకున్న నిరుద్యోగులకు ఈ ప్రైవేటీకరణ విధానం శాపంగా మారిందన్నారు. రెండు సంవత్సరాల నుంచి విశాఖ ఉక్కు గేటు వద్ద కార్మిక సంఘాలు చేస్తున్న పోరాటాల ఫలితంగానే నేటికీ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయలేకపోతున్నారని, ఈ పోరాటాన్ని రాష్ట్ర ప్రజలు, మేధావులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు మరింత ఉధతం చేస్తేనే విశాఖ ఉక్కును కాపాడుకోగలుగుతామని తెలిపారు. రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి మా పని అయిపోయిందని చేతులు దులుపుకోవడం కాకుండా, పోరాడుతున్న ప్రజా సంఘాలతో, కార్మిక సంఘాలతో కలిసి రావాలని, లేని పక్షంలో రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు టీవీవి. ప్రసాద్‌ నగర కార్యదర్శి జి. నాగేశ్వర రావు నగర కార్యదర్శి వర్గ సభ్యులు కత్తి శ్రీనివాసులు, పి సుధాకర్‌ ఆర్‌ శ్రీనివాసులు రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మూలివెంగయ్య పి శ్రీరాములు సిపిఐ నాయకులు షేక్‌ సిరాజ్‌ షేక్‌ షాన్‌ వాజ్‌ ఐ ఎఫ్‌ టి యు నాయకులు రాంబాబు ఏ ఐ ఎఫ్‌ టి యు (న్యూ) జె కిషోర్‌ బాబు యానాదయ్య తదితరులు పాల్గొన్నారు.