May 03,2023 20:58

రాస్తారోకో చేస్తున్న అఖిలపక్ష, కార్మిక సంఘాల నాయకులు

రాయచోటి టౌన్‌ : విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నదని అఖిలపక్ష నాయకులు పేర్కొన్నారు. బుధవారం అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలో బంగ్లా సెంటర్‌లో జాతీయ రహదారిపై విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. సిపిఎం, సిపిఐ, బిఎస్‌పి, కాంగ్రెస్‌ పార్టీలతో పాటు సిఐటియు, ఎఐటియుసి, ఎంఆర్‌పిఎస్‌, మైనార్టీ హక్కుల పరిరక్షణ వేదిక తదితర సంఘాల నాయకులు, కార్యకర్తలు బంగ్లా సెంటర్‌కు చేరుకొని రాస్తారోకో నిర్వహించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కును కాపాడుకుందాం, బిజెపి డౌన్‌ డౌన్‌, ప్రభుత్వ రంగాన్ని కాపాడుకుందాం, అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాస్తారోకో విషయం తెలుసుకున్న రాయచోటి పట్టణ సిఐ సుధాకర్‌రెడ్డి తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని రాస్తారోకో విరమించాలని ఆందోళనకారులకు విజ్ఞప్తి చేశారు. ఆందోళనకారులు రాస్తారోకో కొనసాగిస్తూ రోడ్డుపై బైఠాయించారు. రాస్తారోకోను అడ్డుకునే ప్రయత్నం పోలీసులు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆందోళనకారులను సుధాకర్‌రెడ్డి నేతృత్వంలో అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అరెస్టైన వారిలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు, ఎఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగసుబ్బారెడ్డి, సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు పి.శ్రీనివాసులు, పి.ఎల్‌.నరసింహులు, మైనార్టీ హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర నాయకులు సగీర్‌, సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్‌.చంద్రశేఖర్‌, ఎ.రామాంజులు, ఎఐటియుసి జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సిద్దిగాల శ్రీనివాసులు, బిఎస్‌పి నాయకులు యుగంధర్‌, రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామచంద్ర, రంగారెడ్డి గిరిజన సంఘం నాయకులు విశ్వనాథ నాయక్‌, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఫయాజ్‌, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు నాగబసిరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చిన్నికృష్ణ, ఎంఆర్‌పిఎస్‌ నాయకులు రామానుజులు, తదితరులు ఉన్నారు. అరెస్టు చేసిన వారిని సొంత పూచికత్తుపై విడుదల చేశారు. అనంతరం సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు మాట్లాడుతూ ఎన్నో త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు ప్రయివేటు పరం కాకుండా ఆడ్డుకోవడం కోసం ప్రజలందరూ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. 800 రోజులకు పైగా విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాటాలు చేస్తున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏమి ఎరగనట్లు ఉండటం దుర్మార్గమన్నారు. ప్రయివేటీకరణ ఆపేదే లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దుర్మార్గమని విమర్శించారు. ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమాలకు జగన్‌ ప్రభుత్వం మద్దతు ఇవ్వడమే కాకుండా ఆందోళనలో పాల్గొనాలని వైసిపి శ్రేణులకు పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఒకవైపు మద్దతిస్తూ రెండోవైపు ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపి పట్ల మెతక వైఖరితో వ్యవహరిస్తున్న జగన్‌ బిజెపిపై పోరాడినా సహించలేక పోతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం కూడా విశాఖ ఉక్కు రక్షణకు కట్టుబడి ఉన్నామని చెబుతూనే ఆందోళనలో పాల్గొనకపోవడంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ప్రజలందరూ ఐక్యంగా పోరాడినప్పుడే విశాఖ ఉక్కును కాపాడుకోగలమని వివరించారు. సిపిఎం జిల్లా పి.శ్రీనివాసులు మాట్లాడుతూ 812 రోజులుగా జరుగుతున్న విశాఖ ఉక్కు రక్షణ పోరాటాన్ని అక్రమ అరెస్టులతో ఆపలేరని హెచ్చరించారు. నిర్బంధం పెరిగేకొద్ది ఉద్యమాలు పెరుగుతాయనే కనీస ఇంగిత జ్ఞానం పాలకులు లేకపోవడం దుర్మార్గమన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఉద్యమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వామపక్షాలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. రాజంపేట అర్బన్‌ : విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రయివేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకోమని, విశాఖ ఉక్కు మాదే.. దానిపై హక్కు మాదేనని సిపిఐ సహయ కార్యదర్శి మహేష్‌, ఎఐటియుసి జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.ఎస్‌.రాయుడు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహ అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ పోరాట కమిటీ పిలుపు మేరకు పట్టణంలోని ఎన్‌టిఆర్‌ విగ్రహం ఎదుట ఎఐటియుసి, సిపిఐ, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు రమణ, ఎఐటియుసి పట్టణ కార్యదర్శి సికిందర్‌, జిల్లా భవన నిర్మాణ కార్మికసంఘం నాయకుడు గాలిచంద్ర, కే.వెంకటయ్య, నాయకులు నాగేశ్వరావు, ఉప్పు చంద్ర, చోటు, మహమ్మద్‌, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. బి.కొత్తకోట : విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రయివేటీకరణ చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు సిపిఐ, టిడిపి ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక జ్యోతిచౌక్‌ ఎదుట ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ప్రయివేటీకరణపై జగన్‌ సర్కార్‌ మౌనం వీడాలని, విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అంటూ ప్లే కార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గపు కార్యదర్శి ఎస్‌.మనోహర్‌రెడ్డి, టిడిపి నాయకులు చావిడి కిట్టన్న, నాయకులు ప్రభాకర్‌, బాలాజీ, నాగరాజులు, ఎం.అష్రఫ్‌అలీ, హెచ్‌.షమీవుల్లా, యస్‌.తంబయ్యశెట్టి, జవహర్‌బాబు, బాలకష్ణ, గంగులప్ప, మోదీన్‌ సాహెబ్‌, రియాజ్‌, హాబీబ్‌, ఖాసీం, ఎస్‌.గఫూర్‌ పాల్గొన్నారు. ములకలచెరువు : విశాఖ ఉక్కు ప్రయివేటీకరణను నిరసిస్తూ పట్టణంలోని జాతీయ రహదారిపై సిపిఐ మండల కార్యదర్శి అంజనప్ప, టౌన్‌ కార్యదర్శి ఆనంద్‌ ఆధ్వర్యంలో నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. విశాఖ ఉక్కును ప్రయివేటీకరణ చేస్తే ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.