- 500 రోజులుగా సాగుతున్న ఉద్యమానికి సంఘీభావం
ప్రజాశక్తి-విజయవాడ
నూతన ఆంధ్రప్రదేశ్‌లోని అతిపెద్ద ప్రభుత్వ సంస్థ అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవాలని పలు కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు విశాఖ ఉక్కు పరిరక్షణకు చేస్తున్న ఉద్యమం శుక్రవారానికి 500 రోజులకు చేరుకుంది. ఈ సందర్బంగా స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్‌లో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట ఐక్య వేదిక ఆధ్వర్యంలో ప్రాంతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సులో నేతలు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా ఈ నెల 27న నగరంలోని ధర్నా చౌక్ లో జరిగే ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. ఎన్నో ప్రజాఉద్యమాలు చేసి 23 మంది బలిదానంతో ఏర్పడిన విశాఖ ఉక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉందన్నారు. ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలు లాభాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలను కార్పోరేట్ శక్తులకు ధారదత్తం చేస్తున్నాయని విమర్శించారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో విశాఖ ఉక్కు ఉద్యమం సువర్ణాక్షరాలతో లిఖించబడిందన్నారు. సిఐటియు నాయకులు ఎం.వి.సుధాకర్, ఎఐటియుసి నాయకులు ఎం.సాంబశివరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ రవీంద్రనాథ్, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమామహేశ్వరరావు, ఐఎఫ్‌టియు రాష్ట్ర నాయకులు కె.పొలారి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.సిహెచ్ శ్రీనివాస్, ఐఎఫ్‌టియు రాష్ట్ర నాయకులు ఎం.రామకష్ణ, ఎఐటియుసి రాష్ట్ర నాయకులు కే.సుదీర్, టియుసిఐ నాయకులు ఎం.ప్రసాద్, ఎఐటియుసి నాయకులు ఆంజనేయులు పాల్గొన్నారు.










