ప్రజాశక్తి-కలెక్టరేట్ : ఆంధ్రులు ఎన్నో త్యాగాలు చేసి పోరాడి సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం చేయరాదని శాసనమండలి ప్రొటెం స్పీకర్ వి బాలసుబ్రమణ్యం డిమాండ్ చేశారు. దీనిని ప్రైవేట్ పరం కాకుండా ఎంత దూరమైనా వెళ్లి పోరాడి విజయం సాధిస్తామని చెప్పారు. జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద విశాఖ కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్, ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణ కోసం చేపట్టిన దీక్షలు ఆదివారం నాటికి 101వ రోజుకు చేరాయి. దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఆయన మాట్లాడుతూ విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనేది తెలుగు వారి ఆకాంక్ష అన్నారు. విశాఖపట్నంను రాజధానిగా చేస్తామంటున్న సమయంలో ఈ నగరానికి మణిదీపం వంటి స్టీల్ ప్లాంట్ ను పోగొట్టుకునేది లేదన్నారు. స్టీల్ ప్లాంట్ తో సహా ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేయటానికి మొండిగా, మొరటుగా మోడీ వ్యవహరిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు నష్టాలు వస్తున్నాయని చెబుతున్న మోడీ ప్రభుత్వం ప్రైవేటు రంగంలోని స్టీల్ ప్లాంట్ లకు కల్పిస్తున్న అన్ని సౌకర్యాలను విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఎందుకు కల్పించడం లేదని నిలదీశారు. ప్రైవేటు వారికి సొంత గనులు ఇచ్చారు, విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఎందుకు ఇవ్వలేదని అడిగారు. ఎపిలో గనులు ఉండగా వాటిని ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే పిడిఎఫ్ ఎమ్మెల్సీలు ఏడుగురు కలిసి, ఇదే విషయాన్ని అడగడం జరిగిందన్నారు. ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ కు గనులు కేటాయించే అంశంపై స్పందించలేదని చెప్పారు. ఒకరికోసం మరొకరు సంఘీభావంగా పోరాడే పరిస్థితులు ఉన్నాయని, ఆ విధంగా విశాఖపట్నంలో షిప్ యార్డ్ కార్మికులు స్టీల్ ప్లాంట్ రక్షణ పోరాటానికి మద్దతుగా దీక్షలు సాగించడం హర్షించదగిన విషయం అన్నారు. పిడిఎఫ్ టీచర్స్ ఎమ్మెల్సీ షాబ్జీ మాట్లాడుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకపు నోటిఫికేషన్ ను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటు వారికి అమ్మేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉత్తరాంధ్ర, ముఖ్యంగా విశాఖ ప్రాంతం ఎంతగానో అభివృద్ధి చెందాయని, లక్షలాది మందికి ఉపాధి లభించిందన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం 67 మంది కమ్యూనిస్టు పార్టీల శాసన సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారని, 32 మంది ప్రాణాలర్పించారని చెప్పారు. బిజెపి మినహా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వరంగంలోనే కొనసాగించాలని కోరుకుంటున్న విషయం మోడీకి తెలియదా అని నిలదీశారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలనే నిర్ణయాన్ని రద్దు చేసుకోవాలని, లేకుంటే అన్ని రాజకీయ పక్షాల మద్దతుతో పోరాటం సాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కార్యదర్శి ఎ అజశర్మ , పబ్లిక్ సెక్టార్ కో-ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ ఎస్ జోతీశ్వరరావు, షిప్ యార్డ్ కార్మికులు పాల్గొన్నారు.










