Jan 24,2023 21:57

ఫొటో : ఆర్‌డిఒకు వినతిపత్రం అందజేస్తున్న సిపిఐ నాయకులు

విశాఖ ఉక్కు పరిరక్షణకు ప్రజలు ఏకమవ్వాలి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం ప్రజలందరూ ఏకం కావాలని మున్సిపల్‌ ఎఐటియుసి యూనియన్‌ గౌరవ అధ్యక్షుడు మధు టౌన్‌ కార్యదర్శి హజరత్తయ్య అన్నారు. మంగళవారం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ ఎఐటియుసి రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఆత్మకూరు నియోజకవర్గ మున్సిపల్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఆర్‌డిఒ కరుణ కుమారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షులు యామాల మధు, యూనియన్‌ టౌన్‌ కార్యదర్శి బి.హజరత్తయ్య మాట్లాడుతూ రాష్ట్రంలోనే అతిపెద్ద సంస్థ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ విశాఖ ఉక్కు ఆంధ్రుని హక్కు అనే నినాదంతో 32 మంది విద్యార్థులు బలిదానం చేశారు. ఆనాడు పార్టీలు జెండాలు పక్కన పెట్టి సమైక్యంగా పోరాటం చేసి స్టీల్‌ ప్లాంట్‌ సాధించుకున్నారని తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంకనైనా కళ్లు తెరవాలని, విశాఖ ఉక్కు ప్రయివేటుకరించే ఆలోచన మానుకోవాలని హితవుపలికారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పోరాడాలని, ప్రయివేటీకరణ పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం సాగించడానికి విలువైన భూములను కాజేసే కుట్ర జరుగుతుందన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం అన్ని వర్గాల ప్రజలు రాజకీయ పార్టీలు అందరూ ఏకం కావాలని ఇకనైనా నరేంద్ర మోడీ ప్రయివేటీకరణను విరమించుకోకుంటే ఉద్యమం మరింత ఉధృతంగా చేస్తామన్నారు. కార్యక్రమంలో యూనియన్‌ ట్రెజరీ చెంచయ్య, వాసు, నాగేంద్ర, గోవిందు, సిపిఐ నాయకులు శేషాద్రి పాల్గొన్నారు.