Jan 28,2023 22:32

అధ్యయన కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న ఛైర్మన్‌ శ్యాముల్‌ ఆనంద్‌

          పెనుకొండ : బోయలను ఎస్టీ జాబితాలో చేర్చే అంశంపై పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలోని భువన విజయం సమావేశ మందిరంలో శనివారం సాయంత్రం ఏకసభ్య కమిషన్‌ అధ్యయన సమావేశం నిర్వహించారు. కమిషన్‌ ఛైర్మన్‌ శ్యాముల్‌ ఆనంద్‌ కుమార్‌ ఐఏఎస్‌(రిటైర్డ్‌) అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, కలెక్టర్‌ పి.బసంత్‌ కుమార్‌, సబ్‌ కలెక్టర్‌ నవీన్‌, బిసి సంక్షేమ శాఖ అధికారి నిర్మలాజ్యోతి, లైజనింగ్‌ అధికారులు మస్తాన్‌, రాజకుళ్లయప్ప, సత్యనారాయణ బోయ, వాల్మీకి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోయ, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే అంశంపై శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్‌ సభ్యులు ఆయా వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలు, ప్రతిపాదనలు స్వీకరించారు. బోయ, వాల్మీకి సంఘాల నేతలు, గిరిజన సంఘాల నేతలు ఈ కార్యక్రమానికి హాజరై వారి అభిప్రాయాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వాల్మీకి సంఘాల నాయకులు అంబికా లక్ష్మినారాయణ, బోయ ఈశ్వరయ్య తదితరులు మాట్లాడుతూ వాల్మీకి కులస్తులు దేశవ్యాప్తంగా ఎస్సీలుగానూ, కర్ణాటక రాష్ట్రంలో ఎస్టీలుగానూ పరిగణించబడుతున్నారని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కూడా ఐదు జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతంలోల నివసించే వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించారన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని బోయలందరినీ ఎస్టీలుగా గుర్తించాలని కోరారు. వాల్మీకుల వాస్తవ స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి నివేదికను అందజేసి తమ వర్గాలకు న్యాయం చేయాలని పలువురు వినితులను అందజేశారు. ఎస్టీ సంఘాల ప్రతినిధులు కూడా వారి వాదన కమిషన ముందు వినిపించారు. గిరిజన సంఘాల నేతలు, సర్పంచి ఆంజనేయులు నాయక్‌ మాట్లాడుతూ వాల్మీకి పెద్దలు చదువుకు దూరం ఉన్నామని చెబుతున్నారని ఎస్టీ జాబితాలోకి చేరిస్తే చదువు వస్తుందా అని ప్రశ్నించారు. గిరిజన ప్రజా సంఘాల నాయకులు హరిలాల్‌ నాయక్‌, రంజిత్‌ నాయక్‌లు వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు.