జెవివి జిల్లా గౌరవాధ్యక్షులు రవీంద్ర
ప్రజాశక్తి-తిరువూరు : కరోనా నేపథ్యంలో గత రెండు ఏళ్లుగా పాఠశాలలు సక్రమంగా నడవకపోవడంతో పిల్లలు తమ సహజ నైపుణ్యాలు కోల్పోయారని, జన విజ్ఞాన వేదిక (జెవివి) నిర్వహిస్తున్న శిక్షణ శిబి రం ద్వారా మళ్లీ తిరిగి వినోదంతో పాటు, విజ్ఞానాన్ని పెంచుకోవాలని జెవివి జిల్లా గౌరవాధ్యక్షుడు డాక్టర్ వి.రవీంద్ర అన్నారు. స్థానిక సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వ ర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జెవివి మూఢ విశ్వాసలకు వ్యతిరేకంగా పనిచేయటమే కాకుండా కరోనా కాలంలో రోగులకు సేవలు చేసిన ప్రజాసంఘాల సభ్యులకు సహాయ సహకారం అందజేసిందన్నారు. షుగరు, బిపి రోగులకు ఎనిమిదేళ్ల నుండి వైద్యశిబిరం నిర్వహిస్తూ వేలాది మంది రోగులకు మందులు పంపిణీ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జెవివి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్.గంగాధర్, యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎన్.వెంకటేశ్వర్లు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం నిర్వాహకులు ఎస్.నాగేశ్వరరెడ్డి, జెవివి నాయకులు కె.పాపారావు, డి.సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
అంకితభావంతో పని చేయాలి : ఎంఇఒ
ప్రజాశక్తి-గంపలగూడెం: విధినిర్వహణలో అంకితభావంతో పనిచేస్తే ఎక్కడైనా గుర్తింపు దానంతట అదే వస్తుందని గంపలగూడెం మండల విద్యాశాఖ అధికారి బి సోమశేఖర్‌నాయక్ తెలిపారు. మండలంలోని పెద్ద కెమెర గ్రామ పరిధిలోని ఎపి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ కె.ఆర్ మేరీ ప్రతిష్ట ఇటీవల బదిలీపై గుంటూరు జిల్లా వెళ్లారు. మిగిలిన ఉపాధ్యాయులు వివిధ ప్రదేశాలకు బదిలీపై వెళ్లారు. సోమవారం వారంతా స్థానిక ఆదర్శ పాఠశాలలో ఆత్మీయ సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంఇఒ మాట్లాడుతూ పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంతో మేరి కృషి చేశారన్నారు. రాష్ట్రస్థాయిలో పాఠశాల స్వచ్ఛ విద్యాలయంగా ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు ఈ సందర్భంగా ఆమెను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎంసి చైర్మన్ ఇమ్మానుయేలు పాల్గొన్నారు.
గుండెపోటుతో అకౌంటెంట్ మృతి
ప్రజాశక్తి-నందిగామ : నందిగామకు చెందిన అకౌంట్‌ంట్ తానూరి చంద్రశేఖర రావు (50) సోమవారం గుండెపోటుతో మృతిచెందారు. చంద్రశేఖర్‌రావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చంద్రశేఖర్ నందిగామ, పెనుగంచిప్రోలు తదితర ప్రాంతాల్లో ఎరువుల షాపులు, వస్త్ర దుకాణాలు, లిక్కర్ షాపులు తదితర షాపుల అకౌంట్స్ రాస్తున్నారు. సోమవారం కోదాడ నుండి నందిగామకు బయలుదేరగా హఠాత్తుగా మరణించారు.










