వినియోగదారుల హక్కులను పరిరక్షించాలి
ప్రజాశక్తి-కావలి : సమాజంలో వినియోగదారుల హక్కుల చట్టంపై ప్రజలు అవగాహన పెంచుకొని, వినియోగదారుల హక్కుల రక్షణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని సామాజిక ఉద్యమ కార్యకర్త ఎం.మాలకొండారెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని పాతఊరు మున్సిపల్ హైస్కూల్ ఆవరణంలో బుధవారం ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథి సామాజిక వేత్త ఎం.మాలకొండారెడ్డి మాట్లాడుతూ సమాజంలో ఎక్కడ చూసినా తూకాల్లో తేడాలు, ధరల్లో వ్యత్యాసం, కల్తీలో జోరు వల్ల వినియోగదారుడు తీవ్రంగా నష్టపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఐపిసి 224 సెక్షన్ ప్రకారంగా తూకాల్లో తేడాలు జరిగితే రెండు సంవత్సరాలు జైలు శిక్ష, జరిమానా కూడా ఉంటుందని తెలిపారు. ప్రతి వినియోగదారుడు కొనుగోలు చేసే వస్తువులకి రశీదులు తీసుకోవాలన్నారు. నష్టపోయిన వినియోగదారుడు వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసి, నష్ట పరిహారం పొందాలని కోరారు. అధికారులు, పౌరసంఘాలు, వినియోగదారులను చైతన్యపరిచి వినియోగదారుల హక్కులను పరిరక్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఇన్‌ఛార్జి హెచ్‌ఎం.మధుసూదన్, ఉపాధ్యాయులు దయాలత, విద్యార్థులు పాల్గొని వినియోగదారుల హక్కుల రక్షణ చట్టాన్ని అవగాహన చేసుకోవాలని విద్యార్థులను కోరారు.










