Aug 14,2021 06:35

కేంద్ర మంత్రివర్గ పునరవ్యవస్థీకరణతో పదవులు పొందినవారికి ప్రజాశీస్సులు కావాలంటూ ఈ నెల 16 నుంచి బిజెపి చేపట్టనున్న 'జన ఆశీర్వాద్‌ యాత్ర' ఒక ప్రమాదకర ఎత్తుగడ. పాలక పక్షాలైనా, ప్రతిపక్షాలైనా ప్రజల్లోకి వెళ్లడం మంచిదే. కానీ ప్రజలందరినీ సమస్యల ఊబిలోకి నెట్టి కార్పొరేట్‌ కండబలంతో దర్పం ఒలకబోయడం సమంజసం కాదు. పార్లమెంటులో కొత్త మంత్రులను పరిచయం చేసేందుకు కూడా సహకరించడం లేదంటూ ప్రతిపక్షాలపై నిందలు వేసి మరీ ఈ యాత్రకు ఒడిగట్టడం సిగ్గుచేటు. పైగా కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ భయాందోళనలు వెంటాడుతున్న సమయంలో బిజెపి చేపట్టబోయే ఈ యాత్ర కోవిడ్‌ సూపర్‌ స్ప్రెడ్‌గా మారడం ఖాయం. ఇప్పటికే డెల్టా ప్లస్‌ వేరియంట్‌ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఈ క్రమంలో భారీ జన సమీకరణ కార్యక్రమాలు ఏ కోశానా సముచితం కాబోవని వైద్య నిపుణలు ఇప్పటికే హెచ్చరించారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే 4.30 లక్షల మంది కోవిడ్‌కు బలైపోయారు. 3.21 కోట్ల పైబడి కోవిడ్‌తో ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ లక్షల్లోనే కేసులు నమోదౌతున్నాయి. కోట్ల కొలది జన జీవితాలు అతలాకుతలమయ్యాయి. ఇవేవీ బిజెపికి పట్టడం లేదు. అధికార పీఠాలను పదిలపర్చుకోవడంపైనే దాని శ్రద్ధ అంతా. జన ఆశీర్వాద్‌ యాత్ర అందులో భాగమే. పునరవ్యవస్థీకరణలో చోటు దక్కించుకున్న 39 మంది కొత్త మంత్రులు పాల్గొనే ఈ యాత్ర దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాలలోని 265 జిల్లాల్లో 212 లోక్‌సభ నియోజవర్గాలను కవర్‌ చేస్తూ 1600 పైగా బహిరంగ సభలు నిర్వహించి 20 వేల కిలోమీటర్లు మేర కొనసాగించాలనేది బిజెపి ప్రణాళిక.
     ప్రజలు గుమికూడితే కోవిడ్‌ కట్టడి సాధ్యపడదనే ఇప్పటికీ అనేక రకాలుగా ఆంక్షలు కొనసాగుతూనేవున్నాయి. ఆన్‌లైన్‌ క్లాసులతో పిల్లల చదువులు కొడికడుతున్నాయి. వర్క్‌ ఫ్రం హోం పేరుతో కార్పొరేట్‌ కంపెనీలు వేతనాలు తెగ్గోస్తున్నాయి. మహమ్మారి నివారణకు ఇలా అనేక రకాలుగా ప్రజలు త్యాగాలు చేస్తోంటే బిజెపి మాత్రం కోవిడ్‌ విస్తరణకు ఆజ్యం పోస్తూనేవుంది. వాస్తవానికి దేశంలో కోవిడ్‌ కరాళనృత్యానికి గజ్జెలు కట్టింది మోడీ సర్కారే.
     అమెరికా ఎన్నికల నేపథ్యాన గతేడాది ఫిబ్రవరిలో డొనాల్డ్‌ ట్రంప్‌ కోసం అహ్మదాబాద్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించిన 'నమస్తే ట్రంప్‌' ఎంత వివాదస్పదమైందో విదితమే. ట్రంప్‌తో సహా ఏ ఒక్కరికీ కోవిడ్‌ స్క్రీనింగ్‌ జరపకుండానే అనుమత్వివడం, భారీ జనసమీకరణతో బహిరంగ సభ నిర్వహించడం అనేక ప్రశ్నలకు ఆస్కారమైంది. గుజరాత్‌తో పాటు మహారాష్ట్ర, ఢిల్లీలలో కోవిడ్‌ శరవేగంగా విస్తరించడానికి 'నమస్తే ట్రంప్‌' కారణమైందని వైద్య నిపుణులే నిర్ధారించారు.
     ఢిల్లీలో మైనార్టీల ప్రార్థనల వల్లే కోవిడ్‌ విస్తరించిందని ప్రచారం చేసిన బిజెపి పాలకులే.. మహాకుంభ మేళాకు అనుమతిలిచ్చి లక్షలాది మంది ప్రజల ప్రాణాలు బలిగొనలేదా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాశి సాక్షిగా గంగా నదిలో కొట్టుకుపోయిన శవాలకు బాధ్యత ఎవరిదంటే వేళ్లన్నీ కాషాయ నేతల వైపే కదా చూపాయి. ఇంతటి వినాశకర నేపథ్యంతో నష్ట నివారణ చర్యలకు దిగాల్సిన బిజెపి ఆ పని చేయకుండా నిస్సిగ్గుగా ఇంకో వినాశకర యాత్ర తలపెట్టడం క్షంతవ్యం కాదు.
    ప్రజలు ఓటేసి ఆశీర్వదిస్తేనే కదా చట్ట సభలకు వెళ్తారు. అలాంటి చట్ట సభలను సజావుగా నిర్వహించ లేనప్పుడు మళ్లీ ఆశీర్వద నాటకాలెందుకు? ప్రభుత్వ ఖజానాకు జవాబుదారీ అయిన ప్రభుత్వం తనపై వచ్చే విమర్శలకు పార్లమెంటులో సమాధానమిచ్చితీరాలి. ప్రతిపక్షాలు నిలదీస్తాయి. ఈ వర్షాకాల సమావేశాల్లో ఏకంగా 20 కీలక బిల్లులను ఆమోదింపజేసుకున్న కేంద్రం రెండు మినహా ఏ బిల్లుపైనా చర్చ జరపలేదు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే పనిగా పెట్టుకున్న బిజెపి సభా సాంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చేసి ఇప్పుడు ప్రతిపక్షాలపై సత్య దూరమైన కట్టు కథలను, విద్వేషాన్ని వెదజల్లేందుకు తలపోసిన ఈ యాత్ర ప్రజల ఆరోగ్యం రీత్యా, ప్రజాస్వామ్య ఆరోగ్య రీత్యా ప్రమాదకరమైనది.