రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు విద్యా రంగానికి వినాశకరంగా మారుతున్నాయి. పేదలకు నాణ్యమైన విద్యను అందించడానికే అని ప్రభుత్వం సమర్ధించుకుంటోంది. కానీ, ఆచరణలో ఈ నిర్ణయాలు వారిని బడికి దూరం చేస్తున్నాయి. వికాసానికి అత్యంత కీలకమైన ప్రాధమిక విద్యను సైతం అందకుండా చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన విద్యా విధానాన్ని అమలు చేయడం, ప్రపంచ బ్యాంకు ఆదేశాలను అమలు చేయడమన్నది ఈ నిర్ణయాల వెనుక ఉన్న చేదు నిజం. దానిలో భాగంగా పాఠశాలల్ని, ఉపాధ్యాయ పోస్టులను తగ్గించడం వంటి చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోంది. ఒక కిలోమీటరు లోపు దూరంలో ప్రాథమిక పాఠశాల ఉండాలన్న విద్యాహక్కు చట్టం లోని నిబంధనను మార్చి 3 కి.మీ లోపు ఉండవచ్చంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వులు కూడా ఇటువంటివే! దీంతో పట్టణాల్లో వీధిబడులు, గ్రామాల్లో ఊరిబడులు అదృశ్యమైపోతాయి. రెక్కాడితే గానీ, డొక్కడని నిరుపేదలకు, తరతరాలుగా విద్యకు దూరమైన దళితులకు ఈ పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది.
తెలుగు మీడియంను రద్దు చేయడంతో విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించే చర్యలు ప్రారంభమైనాయి. దశాబ్దాల తరబడి లక్షలాది మందిని విద్యావంతులుగా తీర్చి దిద్దిన ఎయిడెడ్ సంస్థలను ఒక్క కలం పోటుతో రద్దు చేయడానికి ప్రభుత్వం బరితెగించింది. అనూహ్యంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్ల మీదకు రావడంతో కొన్ని మినహాయింపులతో వెనక్కి తగ్గినట్టు ప్రకటించింది. అయినప్పటికీ, ఆ సంస్థలకు ఊపిరి అందకుండా చేసే అన్ని చర్యలనూ తీసుకుంటోంది. ప్రీ ప్రైమరీని ప్రాథమిక పాఠశాలల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. దీంతో అంగన్‌వాడీల స్వతంత్ర ప్రతిపత్తి దెబ్బ తినడంతో పాటు, మాతా శిశుసంరక్షణకు ఉద్దేశించిన వాటి అసలు లక్ష్యమూ ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇది పిల్లలతో పాటు, వారి తల్లులకూ నష్టదాయకంగా మారుతుంది. ఇది చాలదన్నట్లు పాఠశాలల్లో ఒకటి, రెండు తరగతులను మాత్రమే ఉంచి, 3,4,5 తరగతులను హైస్కూళ్లలో కలిపే ప్రక్రియను పెద్ద ఎత్తున ప్రారంభించింది. దీనికి న్యాయపరమైన చిక్కులు రాకూడదన్న ఉద్దేశ్యంతోనే విద్యాహక్కు నిబంధనలను మార్చి మరీ ప్రాథమిక పాఠశాలలు మూడు కి.మీ దూరం ఉండవచ్చంటూ తాజా ఉత్తర్వులు ఇచ్చింది.
ఆరు నుండి పది సంవత్సరాల లోపు పిల్లల మానసిక స్థితి, ఎదుగుదల ఒకే రకంగా ఉంటాయని ప్రపంచవ్యాప్తంగా విద్యావేత్తల, మానసిక శాస్త్రవేత్తల నిర్ధారణ. అందుకే, దాదాపుగా అన్ని దేశాల్లోనూ 1-5 తరగతులు ఒకే యూనిట్‌గా ఉన్నాయి. కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం ఇవేమి పట్టవు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్నట్టుగా వ్యవహరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన విద్యావిధానాన్నే తాము అమలు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుండగా, తమ పాలన లోని రాష్ట్రాల్లో విద్యారంగం వెలిగిపోతోందని విజయవాడలో జరిగిన సభలో బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పడం హాస్యాస్పదం! దేశంలో జరిగిన ఏ ఒక్క అధ్యయనం కూడా బిజెపి పాలిత రాష్ట్రాలు విద్యారంగంలో ముందున్నట్లు చెప్పకపోగా, రోజురోజుకి పతనమవుతున్నాయని ఘోషిస్తున్నాయి. పైగా ఆ రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయి. ఇక ఆయన తిట్టిపోసిన కమ్యూనిస్టులు, యూనియన్లు బలంగా ఉన్న కేరళ విద్యారంగంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్న విషయం అందరికి తెలిసిందే.
నూతన విద్యావిధానం అమలుతో పాటు సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ (సాల్ట్) పేరిట ప్రపంచబ్యాంకుతో విద్యాభివృద్ధి కోసమంటూ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాన్ని చేసుకుంది. ఉపాధ్యాయులపై వ్యయం తగ్గించి, సాంకేతిక పరిజ్ఞానంతో పాఠశాలలు నడపాలన్నది బ్యాంకు నిర్దేశం! ప్రభుత్వం తలపెట్టిన సంస్కరణలన్నీ అమలులోకి వస్తే 54,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులు అవసరం లేకుండా పోతాయన్నది ఒక అంచనా! మోడీ మెప్పు కోసమో.. ప్రపంచబ్యాంకు రుణం కోసమో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు విద్యారంగాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. చిన్నారుల భవిష్యత్తును చిదిమేస్తాయి. అందుకే, ఈ వినాశకర సంస్కరణలను ఎదుర్కుని, విద్యారంగ పరిరక్షణ కోసం ఉద్యమించడం ప్రతి ఒక్కరి బాధ్యత!










