Jan 08,2023 19:04

సంజీవరాయ స్వామికి పొంగళ్లు పెడుతున్న మగవారు

ప్రజాశక్తి - పుల్లంపేట : దేవుళ్లకు ఎక్కడైనా ఆడవాళ్లు పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకుంటారు. అయితే ఇక్కడ మాత్రం మగవాళ్లే పొంగుబాళ్లు పెట్టి మొక్కులు తీర్చుకుంటూ ప్రత్యేక ఆచారాన్ని చాటుతున్నారు. మండలంలోని తిప్పాయపల్లె గ్రామంలో అనాదిగా వస్తున్న ఆచారాన్ని పాటిస్తూ మగవాళ్ల పొంగళ్లను ఘనంగా జరుపుకొంటున్నారు. ప్రతి ఏడాదీ సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం.. సంజీవరాయునికి పొంగళ్లు పెడతారు. సంక్రాంతి కంటే పొంగళుపండుగనే గ్రామస్థులు ఘనంగా జరుపుకొంటారు. గ్రామానికి చెందిన వారు దేశవిదేశాల్లో ఎక్కడున్నా సంక్రాంతి పండుగ ముందు వచ్చే ఆదివారం ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ సంజీవరాయునికి విగ్రహమంటూ లేదు. ఓ రాతిని ప్రతిష్టించి దానిపై శాసనం రాశారు. దాన్నే నేటికీ సంజీవరాయుడిగా భావిస్తూ పూజలు చేస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు.