Jul 11,2021 17:08

గ్రాస్‌ ఇస్లెట్‌ : సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టి20లోనూ 56 పరుగులతో వెస్టిండీస్‌ ఘన విజయం సాధించింది. ఫలితంగా ఐదు టి20ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్థరాత్రి దాటక జరిగిన మ్యాచ్‌లో టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 196 పరుగులు చేసింది. సిమ్రన్‌ హెట్‌మెయిర్‌ (36 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61), డ్వేన్‌ బ్రావో (34 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స్‌లతో 47) ధనాధన్‌ బ్యాటింగ్‌తో దుమ్మురేపగా.. లెండీ సిమ్మన్స్‌ (21 బంతుల్లో 30), ఆండ్రీ రస్సెల్‌ (8 బంతుల్లో 24 నాటౌట్‌) రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్‌ హజెల్‌వుడ్‌, అష్టన్‌ అగర్‌, మిచెల్‌ మార్ష్‌ తలో వికెట్‌ తీశారు.

అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన ఆస్ట్రేలియా.. 19.2 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలి చిత్తుగా ఓడింది. మిచెల్‌ మార్ష్‌ (54) మినహా అంతా విఫలమ్యారు. ఓపెనర్లు మాథ్యువేడ్‌ (0), ఆరోన్‌ ఫించ్‌ (6), మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ జోష్‌ ఫిలిప్‌, హెన్రీక్స్‌ (19), బెన్‌ మెక్‌డెర్మాట్‌ (7), డేన్‌ క్రిస్టియన్‌ (9) తీవ్రంగా నిరాశపరిచారు. విండీస్‌ బౌలర్లలో హైడెన్‌ వాల్ష్‌ (3/29) ఆసీస్‌ పతనాన్ని శాసించగా.. షెల్డన్‌ కాట్రెల్‌ రెండు, ఫిడెల్‌ ఎడ్వర్డ్స్‌, రస్సెల్‌, డ్వేన్‌ బ్రావో, క్రిస్‌ గేల్‌ తలో వికెట్‌ తీశారు. ఇరు జట్ల మధ్య మూడో టి20 మంగళవారం జరగనుంది.