ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్ : వికలాంగత్వం శరీరానికే గాని మనసుకు కాదని వికలాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు పోవాలని పుట్టపర్తి ఆర్డీవో భాగ్య రేఖ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక సాయి ఆరామంలో సత్యసాయి జిల్లా వికలాంగుల సదస్సు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అధ్యక్షతన నిర్వహించారు. ఈసందర్భంగా 2016 దివ్యాంగుల చట్టంపై వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్డీవో మాట్లాడుతూ వికలత్వం ఉన్న చాలామంది ఆత్మస్థైర్యంతో ఎన్నో విజయాలు సాధించారన్నారు. వికలాంగులకు ప్రభుత్వం ఎన్నో సౌకర్యాలు కల్పిస్తోందని 2016 చట్టంపై అవగాహన పెంచుకొని వాటిని వినియోగించుకుని సౌకర్యాలు పొందాలని సూచించారు. దివ్యాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు షఫీ వికలాంగులు ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గంగిరెడ్డి తదితరులు మాట్లాడుతూ వికలాంగులు తమ హక్కులపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా పలువురికి వీల్‌ఛైర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మరుగుజ్జుల రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దిలేటి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
నూతన వస్త్రాలు పంపిణీ
సదస్సులో పాల్గొన్న దాదాపు 130 మంది వికలాంగులకు టిడిపి జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. వికలాంగులకమ్యూనిటీ భవన నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.










