Sep 26,2023 21:46

ఫొటో : దీక్ష చేపడుతన్న వికలాంగులు

వికలాంగులకు ఎల్లప్పుడూ టిడిపి అండ
ప్రజాశక్తి-కావలి : చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా, కావలి నియోజకవర్గ టిడిపి కార్యాలయం వద్ద నియోజకవర్గ స్థాయిలోని టిడిపి వికలాంగ నేతలు, విభిన్న ప్రతిభావంతుల విభాగం సభ్యులు, నియోజకవర్గంలోని పార్టీ కుటుంబ సభ్యులందరూ 13వ రోజు రిలే నిరాహార దీక్షలు ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. దీక్షలో పాల్గొన్న వికలాంగులు మాట్లాడుతూ వికలాంగులమైన తమకు ఎటువంటి పథకం అమలు కావాలన్నా టిడిపిలోనే సాధ్యమైందన్నారు. వైసిపి ప్రభుత్వం ఏర్పడ్డాక తమను పట్టించుకున్న దాఖలాలే లేవన్నారు.
గత తెలుగుదేశం ప్రభుత్వంలో ట్రై సైకిళ్లు, పింఛన్లు, లోన్లు వికలాంగులకు పూర్తిస్థాయిలో అందాయన్నారు. వైసిపి నేతలకు వికలాంగులు అంటే ఎందు కింత చిన్నచూపో అర్థం కావడం లేదన్నారు. తామంతా రాబోయే ఎన్నికల్లో టిడిపి వైపే నడుస్తామని వారు హామీనిచ్చారు. అనంతరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుని 18 రోజులుగా జైలులో ఉంచారని, తాము 13రోజులుగా శాంతియుతంగా ఈ రిలే నిరాహార దీక్షలను చేపడుతున్నామని, కనీసం ఆయనకు జైలులో మంచి వసతులు కూడా కల్పించకుండా కక్ష సాధింపుతోనే ఈ ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ కార్యక్రమంలో అర్హత పొంది లక్షల మంది ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. అటువంటి కేసులో ఆయనని జైలుకు పంపించడం జగన్‌ సైకో ఇజానికి నిదర్శనమన్నారు. ఇటువంటి కక్ష సాధింపు సిఎంను ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఇప్పటి వరకు చూడలేదని, ఇకపై చూడబోరని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను ప్రజలందరూ గమనిస్తున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో టిడిపిని అఖండ మెజారిటీతో గెలిపించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రతిఒక్క పౌరుడు చైతన్యవంతం కావాలని, రాష్ట్ర భవిష్యత్తుతో పాటు బిడ్డల బంగారు భవిష్యత్‌ కోసం చంద్రబాబు నాయుడును సిఎంగా చేసుకోవాలని కోరారు. వికలాంగుల నిరసన దీక్షలో మండవ వెంకట రావు రాష్ట్ర టిడిపి విభిన్న ప్రతిభా వంతులవేదిక, ఉపాధ్యక్షులు, కోడూరు సోమయ్య, మీరయ్య, వేణు, ఇనాయత్‌, హుస్సేన్‌, రాష్ట్ర టిడిపి యూత్‌ అధికార ప్రతినిధి బాలు, మధు, అరటి వేణు, సుబ్రమణ్యం, గాలం మాలకొండయ్య, మాధవరావు నియోజకవర్గ అధ్యక్షులు, పాజర్ల భాస్కర్‌, తదితరులు పాల్గొన్నారు.