ప్రజాశక్తి. పుట్టపర్తి అర్బన్ : రాబోయే ఎన్నికలలో విజయమే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు పని చేయాలని రాష్ట్ర విద్యుత్, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం పుట్టపర్తి నియోజకవర్గం విస్తతస్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మూడున్నర ఏళ్లలో పార్టీ మేనిఫెస్టో లో ప్రకటించిన పథకాలన్నీ అమలు చేశారన్నారు. బాబు అమరావతిలో భూములు కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకున్నారనిఅందుకే మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని తన స్వార్థం కోసమే విజయవాడకు వచ్చారన్నారు. బాబు హయాంలో ఒక్క ప్రాజెక్టు కూడ పూర్తి చేయలేదన్నారు. జగన్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని అందుకు ఐక్యంగా వచ్చే ఎన్నికలలో విజయ డంకా మోగించాలని అన్నారు. సత్య సాయి జిల్లా ఏర్పాటుకు కృషి చేశామని జాతీయ రహదారులు పూర్తి చేయడానికి తగిన చర్యలు చేపట్టామని వివరించారు. పార్టీలకతీతంగా పథకాలు అందరికీ వర్తింపజేస్తున్నామన్నారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఎన్ని జిమ్మిక్కులు చేసినా నియోజకవర్గంలో వైసిపి గెలుపును ఆపలేరని ఈసారి 50 వేలు మెజార్టీతో గెలుస్తామని జోస్యం చెప్పారు.ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాల గెలుపు ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే శంకర్ నారాయణ, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, పార్టీ పరిశీలకులు విష్ణువర్ధన్ రెడ్డి, జెడ్పీ ఛైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, మున్సిపల్ చైర్మన్ తుంగ ఓబుళపతి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ ఆవుటాల రమణారెడ్డి, పుడా చైర్‌పర్సన్ లక్ష్మీనరసమ్మ, వైస్ చైర్మన్లు తిప్పన్న, శ్రీ లక్ష్మీ నారాయణ రెడ్డి, కన్వీనర్లు రంగారెడ్డి, నరసరెడ్డి, నాయకులు లోచర్ల విజయభాస్కర్ రెడ్డి, కేశప్ప, మాధవరెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.










