Jan 08,2023 21:15

సైబర్‌ నేరగాళ్లు

ప్రజాశక్తి మడకశిర : సైబర్‌ నేరగాళ్లు మడకశిర ప్రాంతంలోని బ్యాంకు ఖాతాదారులపై కన్నేశారు. వారి బ్యాంకు ఖాతా నుంచి పెద్ద మొత్తంలో నగదును దోచేసుకుంటున్నారు. ఈనెల 2వ తేదీ నుంచి ఈ దోపీడీ ప్రారంభమైంది. సైబర్‌ నేరగాళ్లు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని లక్షలాది రూపాయలను దోచుకుంటున్నారు. దీంతో ఈ ప్రాంతవాసుల్లో ఆందోళన మొదలైంది.
మడకశిర పట్టణంలోని పలు బ్యాంకులలో ఖాతా కలిగిన లబ్ధిదారుల ఖాతా నుండి లక్షలాది రూపాయల నగదును సైబర్‌ నేరగాళ్లు రాత్రివేళల్లో చడి చప్పుడు లేకుండా దోచుకుంటుండటంతో స్థానికులు ఆందోళకు గురవుతున్నారు. ముఖ్యంగా మడకశిర పట్టణంలో ఉన్న భారతీయ స్టేట్‌ బ్యాంక్‌, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, కర్నాటక బ్యాంకు, యూనియన్‌ బ్యాంకులో ఖాతా కలిగిన వారి ఖాతా నుండి నగదును ఖాతాదారులకు తెలియకుండా నాలుగైదు రోజుల నుంచి సైబర్‌ నేరగాళ్లు అదీ రాత్రి వేళల్లో వారి ఖాతాలలో నగదును ఉపసంహరించుకుంటున్నారు. ఈ మేరకు నగదు ఉపసంహరణ అయినట్లు బాధితుల ఎస్‌ఎంఎస్‌ ద్వారాసమాచారం వస్తోందని బాధితులు హనుమంతరాయప్ప, చిన్నప్ప తదితరులు లబోదిబో మంటున్నారు. తమ ప్రమేయం లేకుండా ఖాతాలో వున్న సామ్ము బదిలీ అవుతుండటంతో దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. బాధితుడు హనుమంత రాయప్పకు బుధవారం రాత్రి ఆంధ్ర ప్రగతిగ్రామీణ బ్యాంకులో అతని ఖాతా నుంచి 5వేల రూపాయల నగదును ఉపసంహరించుకున్నట్లు ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌ ద్దారా సమాచారం అందింది. దీంతో హనుమంతరాయప్ప ఉదయం వెళ్లి బ్యాంకులో ఖాతా చూడగా అందులో కేవలం రెండు రూపాయలు మాత్రమే ఉందని బ్యాంక్‌ అధికారులు చెప్పారు. తన ప్రమేయం లేకుండా తన ఖాతా నుండి నిధులు ఎలా విత్‌డ్రా అయ్యాయని బాధితుడు బ్యాంకు అధికారులను ప్రశ్నిస్తే తమకు ఫిర్యాదు రాసి ఇవ్వాలని ఈ విషయాన్ని సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు సమాచారం ఇస్తామని చెబుతున్నారని బాధితుడు తెలిపాడు. అదే విధంగా ఇదే బాధితుడికి సంబంధించిన భారతీయ స్టేట్‌ బ్యాంకు ఖాతా నుంచి గురువారం అర్ధరాత్రి దాదాపు 30వేల రూపాయల పైగా నగదు ఉపసంహరించుకున్నట్లు ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌ వచ్చింది. దీంతో బాధితుడు శుక్రవారం ఉదయం ఆ బ్యాంకుకు వెళ్లి అధికారులను సంప్రదించాడు. వారు ఖాతా పరిశీలించగా అందులో కేవలం రెండు రూపాయలు మాత్రమే బ్యాలెన్స్‌ చూపించడంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు. అలాగే కర్నాటక బ్యాంకులో చిన్నప్ప అనే ఖాతాదారుని ఖాతా నుంచి వేలాది రూపాయల నగదును సైబర్‌ నేరగాళ్లు డ్రా చేసుకున్నట్లు తెలిసింది. అదే విధంగా శుక్రవారం రాత్రి మరికొంతమంది బ్యాంకు ఖాతా నుంచి నగదు మాయమైంది. పట్టణానికి చెందిన గంగమ్మ అనే మహిళకు చెందిన భారతీయ స్టేట్‌ బ్యాంకు ఖాతా నుంచి 30 వేల రూపాయలు, యూనియన్‌ బ్యాంకు లో 9వేల రూపాయలు నగదు విత్‌డ్రా అయింది. అమరాపురం మండలం గునేహళ్లి గ్రామానికి చెందిన కాంతమ్మ అనే మహిళ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో రుణం తీసుకున్న 55వేలను ఖాతాలో ఉంచుకుంది. ఈమె ఖాతా నుంచి కూడా సైబర్‌ గాళ్లు నగదును మాయం చేశారు. అదేవిధంగా రోళ్ల మండలం వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఓ ఉద్యోగి ఖాతా నుంచి 60 వేల రూపాయలు దోచుకున్నారు. మడకశిర మండలంలో ఉన్నత పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడికి వేతనం ఖాతాలో పడటంతో ఆయన తీసుకున్న బ్యాంకు రుణం సొమ్మును బ్యాంకర్ల జమ చేసుకోగా మిగిలిన మొత్తాన్ని సైబర్‌నేరగాళ్లు మాయం చేశారు. మూడు రోజుల నుండి ఆయా బ్యాంకులలో దాదాపు 20 నుండి 30 మంది ఖాతాదారుల ఖాతాల నుంచి లక్షలాది రూపాయలను గుర్తు తెలియని వ్యక్తులు ఉపసంహరించుకుంటున్నారు. దీంతో బాధితులు బ్యాంకుల వైపు పరుగులు తీస్తున్నారు. బ్యాంకు అధికారులతో ఆరా తీస్తున్నారు. ఖాతాదారులు ఇంతకు మునుపు బ్యాంకు లావాదేవీలకు సంబందించి క్యాష్‌ కలెక్షన్‌ పాయింట్‌, లేదా ఇతర చోట్ల వేలిముద్రలు వేసి ఉంటారని సైబర్‌నేరగాళ్లు ఆ వేలిముద్రల ఆధారంగా నగదును దోచుకుంటూ ఉండవచ్చునని ఓ బ్యాంకు అధికారి ప్రజాశక్తితో వ్యాఖ్యానించారు. బ్యాంకర్ల, పోలీసులు ఈ విషయంపై స్పందించి సైబర్‌ నేరగాళ్ల ఆట కట్టించి తమకు న్యాయం చేయాలని బాధితులు, బ్యాంకు ఖాతాదారులు కోరుతున్నారు.