విజేతలకు బహుమతులు ప్రదానం
ప్రజాశక్తి-అనంతసాగరం : సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి, పోటీలో పాల్గొన్న వారందరికీ సిపిఎం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బహుమతి ప్రదానోత్సవం స్థానిక ఎస్‌సి కాలనీ స్కూల్‌వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమనికి సిపిఎం అనంతసాగరం కార్యదర్శి అన్వర్ బాషా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మంగల.పుల్లయ్య మాట్లాడుతూ సంక్రాంతి పండుగ రోజు మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం అభిందనీయమన్నారు. పండగ రోజు వ్యవసాయ కార్మికులు నిత్యం ఉండే పని ఒత్తిడిని దూరం చేయడం, వారికి ఆట విడుపుగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల మహిళల్లో దాగివున్న సృజనాత్మకత వెలుగులోకి వస్తుందన్నారు. మహిళా సమస్యల పరిష్కారానికి మహిళలందరూ సంఘటితమై, కూలి పనుల సమస్యపై పోరాటం చేయాలన్నారు. వారి పోరాటానికి, వ్యవసాయ కార్మిక సంఘం, సిపిఎం పార్టీ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. కార్యక్రమంలో జెవివి నాయకులు వేము పెంచలయ్య, గాడి సుధాకర్, యుటిఎఫ్ సీనియర్ నాయకులు పి.నరసింహులు, రహంతుల్లా, హెల్త్ సూపర్‌వైజర్ తానికొండ ప్రసాద్, డివైఎఫ్‌ఐ నాయకులు ఎస్‌డి సంధాని, సిపిఎం సభ్యులు నరసింహులు, వెంకటేశ్వర్లు, రవి, డప్పు కళాకారుల సంఘం నాయకులు సుందరయ్య, పోటీలో పాల్గొన్న మహిళలు పాల్గొన్నారు.










