Jan 20,2023 21:37

ఫొటో : విజేతలకు బహుమతులు అందజేస్తున్న అతిథులు

విజేతలకు బహుమతులు అందజేత
ప్రజాశక్తి-కావలి : వెంగళరావు నగర్‌ 22వ వార్డులో డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు ముగ్గులు పోటీలు - విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. శుక్రవారం ఐద్వా జిల్లా కార్యదర్శి మస్తాన్‌బీ, అధ్యక్షులు శివకుమారి విజేతలకు, పాల్గొన్న 85 మంది మహిళల అందరికీ బహుమతులు అందజేశారు. అంతేకాకుండా ఆటల పోటీలలో గెలుపొందిన 30 మంది పిల్లలకు ఎగ్జామ్‌ప్యాడ్‌లు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో వెంగలరావు నగర్‌ ప్రాంతంలో ప్రతి సంవత్సరం మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం చాలా మంచి పరిణామమన్నారు. ప్రస్తుత సమాజంలో మహిళలకు భద్రత లేకుండా పోతుందని, తరచుగా మహిళలపై దాడులు, పని ప్రదేశాల్లో, పాఠశాలల్లో మహిళలపై బాలికలపై మైనర్‌ బాలికలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయన్నారు. సాక్షాత్తు ఢిల్లీ మహిళా చైర్మన్‌ స్వాతిమాలీవాల్‌పై ఆగంతుకుడు దుర్మార్గంగా వ్యవహరించారన్నారు. ఆమెకే రక్షణ లేనప్పుడు ఇక సామాన్య మహిళలకు ఎలా రక్షణ ఉంటుందని ప్రశ్నించారు. మహిళలకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫల మవుతున్నాయన్నారు.
ఎన్నికలప్పుడు మహిళలకు పెద్దపెద్ద వాగ్దానాలు చేసిన పాలకులు గద్దెనెక్కిన తర్వాత మహిళల సమస్యలను పట్టించుకోకపోవడం మహిళలకు భద్రత కల్పిం చకపోవడం చాలాదుర్మార్గమైన విషయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మద్యం బెల్టు షాపులను దశల వారీగా క్రమ బద్దీకరిస్తామని చెప్పిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం ఏరులై పారుతుందన్నారు. దీని వల్ల సామాన్య పేద కుటుంబాలు చితికిపోతున్నాయన్నారు. మహిళల సమస్యలపై సమస్యల పరిష్కారానికి ఐక్యంగా మహిళలు పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ పోరాటాలకు ఐద్వా ఎప్పుడు ముందుంటుందని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి పి.పెంచలయ్య, సిఐటియు పట్టణ కార్యదర్శి వై.కృష్ణమోహన్‌, డివైఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి పి.పెంచల నరసింహం, సిపిఎం నాయకులు బి.కృష్ణయ్య, కె.చెన్నయ్య, డైఫీ నాయకులు పి.కోటేశ్వరరావు, పి.శ్రీనివాసులు, మహిళలు పాల్గొన్నారు.