May 16,2023 21:26

మాట్లాడుతున్న కమిషనర్‌

మాట్లాడుతున్న కమిషనర్‌
వీధికుక్కలకు యాంటి రాబిస్‌ టీకాలు
- కమిషనర్‌ వికాస్‌ మర్మత్‌, ఐ.ఏ.ఎస్‌
నెల్లూరు:వీధికుక్కల కాటునుంచి ప్రజలకు ప్రమాదకర పరిస్థితులు తలెత్తకుండా నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ప్రత్యేక డ్రైవ్‌ లు నిర్వహించి కుక్కలకు యాంటి రాబిస్‌ టీకాలు అందిస్తున్నామని కమిషనర్‌ వికాస్‌ మర్మత్‌ వెల్లడించారు. స్థానిక బాలాజీ నగర్‌ కాంతమ్మ ఆశ్రమం సమీపంలోని సచివాలయం వద్ద వీధికుక్కలకు రాబిస్‌ టీకాలు వేసే కార్యక్రమాన్ని కమిషనర్‌ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ వీధి కుక్కల సమస్యలపై 9553219996 నెంబరుకు సమాచారం అందించాలని సూచించారు. టీకాలు వేసిన అనంతరం ఆయా కుక్కలను స్థానిక ప్రదేశంలోనే వదిలేస్తారని, దుందుడుకు స్వభావం ఉన్న కుక్కలను టీకాల తర్వాత కొద్దిరోజులు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచుతారని తెలిపారు. డివిజన్లలోని స్థానిక కార్పొరేటర్ల సహకారంతోనే వీధి కుక్కలకు టీకాలు వేసే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించనున్నామని తెలిపారు
.అనంతరం నగర పాలక సంస్థ పరిధిలోని స్థానిక బాలాజీ నగర్‌ 15/1, 2, 3, 16/1, 2, 3 సచివాలయాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయాలలోని ఇన్స్పెక్షన్‌ రిజిష్టరు, నోటీసు బోర్డు, హాజరు రిజిస్టరు, స్పందన రిజిష్టరులతో పాటు వివిధ సంక్షేమ పథకాల రికార్డులను పరిశీలించారు. పెండింగులో ఉన్న సేవలను గడువులోపు పూర్తి చేయాలని, సాంకేతిక అంశాలపై నేరుగా సూచనలు పొందాలని కార్యదర్శులకు కమిషనర్‌ సూచించారు. స్పందన వేదిక, జగనన్నకు చెబుదాం కార్యక్రమాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో బాధ్యతగా ఉండాలని, సమస్యలు పునరావతం కాకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు.ఎస్‌.డి.జి సర్వే, భూహక్కు సర్వే, ఎ.పి సేవా పోర్టల్‌ అంశాలపై ప్రత్యేక దష్టి సారించి సూచించిన యాక్షన్‌ ప్లాన్‌ ను అమలు చేయాలన్నారు. అదేవిధంగా ప్రతీ నెలా నాలుగు సార్లు ప్రత్యేక డ్రైవ్‌ లను నిర్వహించి ఆస్థి పన్ను, యూజర్‌ చార్జీల వసూళ్ళను సచివాలయ కార్యదర్శులు వేగవంతం చేయాలని సూచించారు. ప్రజలకు అందించే సేవల్లో నిబద్ధత పాటించాలని, తమకు నిర్దేశించిన పన్నుల వసూళ్ల లక్ష్యాలను గడువులోపు అందుకోవాలని సూచించారు. జగనన్న కాలనీ లే అవుట్ల నిర్మాణం పనులను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు సుజాత, శ్రీకాంత్‌ రెడ్డి, నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ వెంకట రమణ, పశు వైద్యాధికారి డాక్టర్‌ మదన్‌ మోహన్‌, శానిటేషన్‌ అధికారులు, సచివాలయాల కార్యదర్శులు పాల్గొన్నారు.
5