అనంతపురం ప్రతినిధి : అధికార వైసిపి అప్పుడే ఎన్నికలకు సర్వం సిద్ధమవుతోంది. గతేడాది నుంచే గడపగడపకూ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. అది ఇంక కొనసాగుతూ ఉంది. అయితే ఈ కార్యక్రమం అంతగా ఫలితాలిస్తున్నట్టు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మరింత లోతుగా ప్రజలకు చేరవయ్యేందుకు సన్నద్ధమైంది. పట్టణాల్లో వంద కుటుంబాలకు ఒక వాలంటీరు, గ్రామాల్లో 50 ఇళ్లకు ఒకరు చొప్పున ఉన్నారు. వీరి ద్వారా సంక్షేమ పథకాలను, కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. అయితే ఎన్నికల్లో వాలంటీర్లను పక్కనబెడితే ఏమవుతుందో గుబులో ఏమోగాని వారి కింద మరికొంత మందిని నియమించే ప్రక్రియను అధికార వైసిపి చేపడుతోంది. అది వాలంటీర్ల ద్వారానే చేపడుతోంది. ప్రతి వీధికి ఒక గృహ రథసారధి పేరుతో నియామకాలను చేపడుతున్నారు. ఇప్పటికే వార్డుకు ఒక కన్వీనర్‌ను నియమించారు. ఇది కాకుండా తాజాగా వీధికొక గృహ రథసారధిని నియమిస్తున్నారు. వాలంటీర్లకు ఎన్నికల సంఘం వీధుల్లోకి తీసుకోకుండా ఇతర వాటికి వినియోగిస్తే గృహ రథసారధుల ద్వారా ప్రజలకు చేరవయ్యేందుకు ప్రణాళిక రచిస్తోంది. ఈ రథసారధులు ఎన్నికల వరకు ప్రతి ఇంటికెళ్లి ఆయా కుటుంబానికి జరిగిన మేలు గురించి వివరించాల్సి ఉంటుంది. వారి ద్వారానే ఎన్నికల్లోనూ ఓటర్లను ప్రభావితం చేసే ఆలోచనలోనున్నట్టు తెలుస్తోంది. ఈ రకంగా ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో వేలాది మంది గృహ రథసారదులను ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతోంది. రథసారధులను వాలంటీర్ల ద్వారానే గుర్తించి వారి ఆధార్‌కార్డులు, పాస్‌పోర్టు సైజ్ ఫోజులు సైతం సేకరిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేసి ఎన్నికలకు సన్నద్ధమయ్యే పనులను చేపడుతోంది.
ఎన్నికల కోసమేనా ?
ఈ రకంగా పెద్దఎత్తున చేపడుతున్న నియామకాలు వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకునేనా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే వార్డు కన్వీనర్లు, వాలంటీర్లు కాక, మరింత మందిని గృహ రథసారధులు చేపడుతుండటం ఎన్నికల్లో సులభంగా ప్రతి ఓటరును ప్రభావితం చేయడానికేనా అన్నది చర్చ సాగుతోంది. ఇది పూర్తయితే ఎన్నికలకు ఇంత పెద్ద యంత్రాంగం మరే ఇతర పార్టీ వద్ద ఉండే అవకాశం లేదు. సూక్ష్మస్థాయి ప్రతి ఓటరు మొదలుకుని ప్రభావితం చేసేందుకు వీలుగా అధికారపార్టీ కసరత్తు ప్రారంభించిందనే చెప్పాలి. సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల మనుషుల్లో స్థానముందని చెప్పుకునే వైసిపి ఈ రకమైన ప్రణాళికతో ముందుకుపోవడం ఏమిటన్నది కూడా రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఉద్యోగుల్లో కాస్త వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు కాకుండా ఇతర సామాజిక తరగతులు, ఇతర వర్గాలకు తమ వైపు బలంగా తీప్పుకోవడంతోపాటు, తమక అనుకూలమైన వారితో ఓటింగ్ చేయించుకునేందుకు వీలుగా అధికార వైసిపి ఈ రకమైన ఎత్తులు వేస్తున్నట్టు విపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. ఇవన్నీ ఏ రకమైన ఫలితాలను అధికారపార్టీకి తెచ్చిపెడతాయన్నది చూడాల్సి ఉంది.










