Jan 11,2023 19:54

లబ్ధిదారులకు చెక్‌ అందజేస్తున్న కలెక్టర్‌ గిరీష

ప్రజాశక్తి-రాయచోటి: జగనన్నతోడు చిరు వ్యాపారులు, సంప్రదాయ వృత్తులవారికి బాసటగా నిలుస్తోందని కలెక్టర్‌ గిరీష పేర్కొన్నారు. బుధవారం జగనన్నతోడు 6వ విడతలో భాగంగా చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు, జగనన్నతోడు పథకం ద్వారా రుణాలు పొంది, సకాలంలో చెల్లించిన వారికి వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో కలెక్టర్‌ గిరీష, మున్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌బాషా, డిఆర్‌డిఎ పీడీ సత్యనారాయణ, ఎల్‌డిఎం వెంకటేశ్వర్‌రెడ్డి, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జగనన్న తోడు పథకం 6వ విడత జిల్లాలో 11,134 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.పది వేలు చొప్పున రూ.11.13 కోట్లు లబ్ధిదారులకు జమ చేశామని పేర్కొన్నారు. జగనన్న తోడు పథకం కింద రుణాలు పొంది, సకాలంలో చెల్లించిన 19,687 మందికి రూ.47.19 లక్షలు వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ కింద లబ్ధిదారులకు జమ చేశారన్నారు. ప్రభుత్వం చిరు వ్యాపారులకు ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. చిరు వ్యాపారులు తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లించి నట్లైతే తిరిగి వడ్డీ లేని రుణాలు పొందవచ్చునన్నారు. వీధి వ్యాపారులకు బాసటగా నిలుస్తున్న జగనన్నతోడు పథకాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. చిరు వ్యాపారులకు రూ.10 వేలు వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతో మహిళల ముఖంలో చిరునవ్వులు కనిపిస్తున్నాయని తెలిపారు. ఈ డబ్బును అనవసరమైన అవసరాలకు ఉపయోగించకుండా తీసుకున్న అవసరాలకు మాత్రమే ఖర్చు చేసి ఆర్థికాభివృద్ధి చెందాలన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు కలెక్టర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ చేతుల మీదుగా మెగా చెక్కును అందజేశారు. అనంతరం పొదుపు సంఘాల మహిళలు తయారుచేసిన తినుబండరాలు, తదితర వాటిని కలెక్టర్‌ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.