మాట్లాడతున్న మేయర్
వీధి కుక్కల నియంత్రణకు తక్షణమే చర్యలు
- మేయర్ స్రవంతి జయవర్ధన్
నెల్లూరు:జనావాసాల మధ్య తిరుగుతూ ప్రమాదకరంగా మారిన వీధి కుక్కల నియంత్రణపై నగరపాలక సంస్థ ప్రజారోగ్యశాఖా విభాగం తక్షణమే చర్యలు తీసుకోవాలని మేయర్ స్రవంతి జయవర్ధన్ ఆదేశించారు. మంగళవారం కార్పోరేషన్ కార్యాలయంలో మేయర్ ఛాంబర్‌లో నగరపాలక సంస్థ ప్రజారోగ్యశాఖాధికారి డా.వెంకటరమణ, ఇతర అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరవ్యాప్తంగా అన్ని డివిజన్లలో వీధికుక్కల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వీధి కుక్కలు ప్రమాదకరంగా కనిపించిన యెడల తక్షణమే కార్పోరేషన్ అధికారులకు ఫిర్యాదు చేయాలని ప్ర్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వెంటనే స్పందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. డివిజన్ల వారీగా వీధి కుక్కల గణాంకాలను పరిశీలించి నియంత్రించేందుకు అవసరమైన శస్త్ర చికిత్సల సంఖ్యను పెంచాలని సూచించారు. ప్రమాదకరంగా కనిపించే వీధి కుక్కల సమాచారాన్ని తెలిపేందుకు ప్రత్యేక ఫోన్ నెంబర్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఫోన్ ద్వారా అందుకున్న ఫిర్యాదులను నిరంతరం పర్యవేక్షించేలా సిబ్బందికి విధులు కేటాయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజారోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు.










