Sep 12,2020 07:55


తె.ర
'సరిగమా పద నిస్సా
అరె కరో కరో జర జల్సా
వీడు ఆరడగుల బుల్లెట్టు
వీడు ధైర్యం విసిరిన రాకెట్టు...'
పాడుకుంటూ వస్తున్న ఫ్యానప్పలను దూరం నుంచి చూసి నొసలు చిట్లించాడు వకీల్‌ స్టార్‌.
తన పక్కనే పేర్చుకున్న పుస్తకాల దొంతర లోంచి ఒకటి తీసి అటూ ఇటూ కెమెరాలకేసి చిరాగ్గా చూశాడు. ఇంటర్వ్యూలు చేసి ఫీడ్‌ పంపుతున్న సెక్రట్రీని కేకేశాడు.
'ఏంటిది? మన ఫ్యాన్స్‌ అప్‌డేట్‌ అవరా..నేను నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నాను? ఈ దీక్షలో కూడా ఇన్ని పుస్తకాలెందుకు తెమ్మన్నాను? రెండేళ్ల గ్యాప్‌ తర్వాత వచ్చే నా సినిమాల సంగతి చూసుకోలేనా? నన్ను నమ్ముకున్న కోట్ల మంది కోసం కదా నా తపన.. వూ..'
ఇవన్నీ కొట్టిన పిండి గనక సెక్రట్రీ పెద్ద ఫీలింగ్‌ లేకుండా నిలబడ్డాడు.
'ఏంటి నువ్వు కూడా మాట్లాడవ్‌? క్యాచ్‌ చేసుకోలేకపోతున్నారా?'
'మేమేంటి సార్‌...పెద్ద పెద్ద పార్టీల వాళ్లే మీ వెరైటీ థాట్స్‌ క్యాచ్‌ చేయలేకపోతుంటే?'
'ఆ.. ఆ.. అదేం కాదు గాని.' సంతోషం లోలోపల దాచుకుంటూ అన్నాడు వకీల్‌ స్టార్‌.
'మన వాళ్లను పిలువ్‌..ఒకసారి ఎక్స్‌ప్లయిన్‌ చేద్దాం' అంటూ పురమాయించి మరో పుస్తకం తీసుకున్నాడు. పేజీలు తిరగేస్తూ ఒక కంటితో గమనిస్తున్నాడు.
ుు
సెక్రట్రీ ఫ్యానప్పలను కేకేశాడు.
'సార్‌ రమ్మంటున్నారు'
ఆ అంటూ పడిపోయినంత పని చేసి పరుగులు తీశారు. హడావుడి స్టార్‌కు బాగా సంతోషం కలిగించినట్టు పుస్తకం లోంచి కనిపిస్తోంది.
'ఆ ఆ.. ఏంటి ఇంకా ఓల్డ్‌ సాంగ్‌ పాడుతున్నారు?'
'ఆ పాట ఎప్పటికీ మాకు ఓల్డ్‌ కాదు సార్‌. అయినా మీరెప్పటికీ ఆరడగుల బుల్లెట్టే సార్‌. బుద్ధిలేని ఓటర్లు మిమ్మల్ను రెండు చోట్ల ఓడించినంత మాత్రాన మీ విలువ తగ్గదు సార్‌.. అన్న ఒకచోటైనా గెలిచాడు తమ్ముడు రెండు చోట్ల పోయాడని గిట్టని వారు అన్నంత మాత్రాన మేము పట్టించుకోం సార్‌..' ఫ్యానప్ప వూగిపోతున్నాడు.
'మీరు కొమరం పులి సార్‌ పులి..'
'పులేంటయ్యా.. సార్‌ సింహం కదా...' మరో ఫ్యానప్ప అందించాడు.
'నీవేం ఫాన్‌వురా? చూడప్పా సిద్దప్పా నేను సింహం లాటోణ్ని. కాకుంటే అది గడ్డం చేసుకోదు. నేను చేసుకుంటాను. మిగిలినదంతా సేమ్‌ టు సేమ్‌ అనలేదా' మూడో ఫ్యానప్ప మాట
ఇలా అందరిలో తన ఫానిజాన్ని తక్కువ చేసేసరికి మొదటి ఫ్యానప్పకు కోపం వచ్చింది. 'సర్లేవోరు! ఇప్పుడు సార్‌ కూడా గడ్డం గీసుకోలేదు కదా అని అలా అన్నాన'ంటూ వాదన పెట్టుకున్నాడు.
దాదాపు రుషి లెవల్లో పెరిగిపోయిన గడ్డం నిమరుకుంటూ వకీల్‌ స్టార్‌ ఇబ్బందిగా చూస్తున్నాడు.
ఇంతలో సెక్రట్రీ సైగ అందుకున్న మరో ఫ్యానప్ప వూగిపోతూ ముందుకొచ్చాడు.
'వీళ్లకేమీ తెలియదు సార్‌.. మీరిప్పుడు సింహం కాదు, నరసింహావతారంలో వున్నారు. ఇందాకే వస్తూ మన తాజా వీడియో చూసొచ్చాను సార్‌..'
'అందులో పాట నేర్చుకొచ్చావా మరి' పెద్దగా నవ్వుతూ అడిగాడు వకీల్‌స్టార్‌. అలా అనడం ఆలస్యం తను పాటెత్తుకున్నాడు
'వీడు ఆరెస్సెస్‌ బుల్లెట్టు
అంతర్వేది టార్గెట్టు...'అని పాటెత్తుకున్న ఫ్యానప్పను చూస్తూ హ్యాపీగా హ్యాపీ గడ్డం రుద్దుకున్నాడు.
అప్పుడొచ్చాడు మరో ఫ్యానప్ప. స్టార్‌ను దగ్గరగా చూసిన పరవశంలో వంగిపోతూ మెలికలు తిరుగుతూ
'అమెరికా నుంచి మన సైనికులు మీకో చిరు కానుక పంపించారు సార్‌. మీరు ఎర్ర పంచ వేసుకుని వాళ్ల యూనివర్సిటీలో మాట్లాడి మంటలు పుట్టించారట సార్‌...' అంటూ ఒక ప్యాకెట్‌ విప్పబోయి కార్యదర్శి కనుసైగతో ఆగిపోయాడు.
'ఎలాగయ్యా మీరు ఏదీ ఫాలో కావడం లేదు..సార్‌ ఇప్పుడు ఆ రంగు మార్చేశారు. ఇదిగో ఇది కప్పండి. ఫోటో తీస్తాను' అంటూ కాషాయ వస్త్రం, కమండలం అందించాడు. వాటిని తీసుకుంటుండగా వీడియో తీశాడు. 'సరే ఇక బయిలుదేరండి..మళ్లీ సార్‌ బమ్మ వస్తుంది..ఈ లోగా టీజర్లు అన్నీ హిట్‌ చేయాలి మరి..'
'ఎప్పుడెప్పుడా అని చూస్తున్నాం..' అంటూ వారంతా వెళ్లడానికి సిద్ధమయ్యారు.
'సరే, నేనూ అదే చూస్తున్నా. మీరు వెళ్లిపోతే మా సెక్రట్రీతో కాస్త మాట్లాడాల్సిన పనుంది..'
ఆ మాట వినగానే గుండెల్లో రాయిపడిన సెక్రట్రీ బెంబేలెత్తిపోయాడు.
ుుు
'సెక్రట్రీ, ఇప్పుడు చెప్పు.. నీవు పెట్టిన బుక్స్‌ ఏమిటీ? ఈ బ్యాక్‌ డ్రాప్‌ ఏమిటి?'
'మీరు లాస్ట్‌టైం విజయనగరంలో నిరాహారదీక్ష చేసినప్పుడు పక్కన పెట్టుకున్న బుక్స్‌ వెతికి మరీ తెప్పించాను. టీవీల్లో లైవ్‌ వస్తుంది. మన సైట్లలో ఎప్పటికీ వుంటాయి..'
'చే గువేరా మోటార్‌ సైకిల్‌ డైరీ...తరిమెల నాగిరెడ్డి తాకట్టులో భారతదేశం, తెలంగాణ రైతాంగ పోరాటం, ఏమిటయ్యా.. ఇవన్నీ టీవీల్లో చూపిస్తారు కదా..అప్‌డేట్‌ అప్‌డేట్‌ అని గోలపెడుతున్నా మీకు అర్థం కాలేదయ్యా..అది సరే బయిట గోల ఏంటి?'
'ఎవరో బ్రహ్మానంద స్వామి మీకోసం వచ్చారట సార్‌..'
'ఈ సెట్టింగులో బాగా కుదురుతుంది గాని రమ్మను..'
ుు
'పైన పటారం లోన లటారం...ఈ జగమంతా డంభాచారం...' స్వామి తమాషా చిందులేస్తూ వచ్చాడు.
'ఏమిటి స్వామీ తమరి నోట ఈ పాట..' వకీల్‌ స్టార్‌ సందేహంగా అడిగాడు.
'నాది కాదు బాబూ తమరిదే. గుడుంబా శంకర్‌లా ఈ పాట పాడి నన్ను బ్లాక్‌మెయిల్‌ చేశావు కదా..'
'ఆ కామెడీ ట్రాకా..' చిద్విలాసంగా నవ్వేశాడు వకీల్‌ స్టార్‌.
'కామెడీ ట్రాక్‌ అక్కడితో అయిపోయిందా. మళ్లీ అత్తారింటికి దారేదీ అంటూ ఇలాగే సన్యాసి వేషంలో వచ్చి మాయమాటలతో నన్ను బురిడీ కొట్టించావా? ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే వెళతానంటూ తొక్కిపారేసి సన్యాసిని చేశావా..'
'బద్దం భాస్క్‌ర్‌...ఆ కథలన్నీ ఇప్పుడెందుకు.. మళ్లీ కొత్త సినిమాల్లో చూసుకుందాంలే ఆ కామెడీ...'
'వేరే ఎందుకు బాబూ.. తమ లైఫ్‌ కంటే పెద్ద షో ఏముంటుంది. మీరే సిద్దు సిద్ధార్థరారు, మీరే చే గువేరా..మీరే కొమరం పులి, మీరే గబ్బర్‌ సింగ్‌. మీరే కాటమ రాయుడు..ఇప్పుడు మీరే అపర నరసింహ స్వామి.. అసలు మీరేంటి మీకైనా తెలుస్తుందా? అసలిన్ని వేషాలు ఎలా వేస్తున్నార్‌ సార్‌..' బ్రహ్మానంద స్వామి తనదైన శైలిలో చొక్కా చింపుకుంటూ కిందపడి దొర్లసాగాడు.
ుుుుుు
ఈలోగా సెక్రట్రీ బ్యాక్‌ డ్రాప్‌ మార్చి అష్టోత్తర నామార్చన. అఖండ హిందూ చరిత్ర, ఆరెస్సెస్‌ అడుగుజాడలు, పరివార్‌ పారాయణం, స్టోరీ ఆఫ్‌ గ్లోబల్‌ కన్సర్వేటిజం ఎట్సెట్రా బుక్స్‌ తీసుకొచ్చాడు.
వాటిని తృప్తిగా చూస్తూ 'కెమెరా ఆన్‌' అని సైగ చేశాడు వకీల్‌స్టార్‌.
కింద పడి దొర్లుతున్న బ్రహ్మానంద స్వామి లేచి మళ్లీ స్టెప్పులు మొదలెట్టాడు
'కాటమ రాయుడా కదిరీ నరసింహుడా
రంగుల మార్పులో జల్సా చేరు వీరుడా
ఇలా వేషాలు ఎన్ని వేసినా ఆఖరి పంచ్‌ ప్రజల చేతుల్లో వుంటుంది .. అది మాత్రం గుర్తు పెట్టుకో. ఈ వేషాలకు గాను నేను స్థాపించిన భాస్కర్‌ అవార్డు ఇదిగో' అంటూ చేతిలో పెట్టి...'మనీ' సినిమాలో 'సేమ్‌ చిరంజీవి' లెవల్లో బయిటకు నడిచాడు బ్రహ్మానంద స్వామి.