Jan 18,2023 23:04

ఆందోళన చేస్తున్న బలిజ సంఘం నాయకులు

హిందూపురం: పట్టణంలోని గురునాథ్‌ సర్కిల్‌ సమీపంలో శ్రీకృష్ణదేవారాయ విగ్రహ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తు బలిజ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బలిజలు బుధవారం స్థానిక మున్సిపల్‌ కార్యలయం ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా మున్సిపల్‌ అధికారులకు వ్యతిరేకంగా నినదాలు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు పట్టణంలో గురునాథ్‌ సర్కిల్‌ సమీపంలో శ్రీకృష్ణదేవారాయ విగ్రహ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని గతంలోనే మున్సిపల్‌ అధికారులకు కోరామన్నారు. ఫిబ్రవరి నెలలో శ్రీకృష్ణదేవారాయ జయంతిని పురష్కరించుకుని విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి స్థలాన్ని ఎంపిక చేసి, మంగళవారం పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. అయితే అధికారులు పనులను అడ్డుకున్నారన్నారు. నిబందనలు అనుసరించి, విగ్రహ ఏర్పాటకు అనుమతులు కోరుతున్నప్పటికి అనుమతులు ఇవ్వాకుండా ఒక వర్గాన్ని అణచి వేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో సిఐ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో అక్కడికి చేరుకుని, ఆందోళన కారులకు నచ్చజెప్పారు. మున్సిపల్‌ కమిషనర్‌ అందుబాటులో లేక పోవడంతో మున్సిపల్‌ వైస్‌చైర్మేన్లు జబివుల్లా, బలరామిరెడ్డి అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. విగ్రహ ఏర్పాటుకు అనుమతులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రెండు, మూడు రోజుల్లో కౌన్సిల్‌ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, విగ్రహ ఏర్పాటకు అనుమతులు మంజూరు చేస్తు అమోదం తెలిపిన పత్రాన్ని అందిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో బలిజ సంఘ నాయకులు అకుల ఉమేష్‌, రాయల్‌ గోపాల్‌, విజయ గోపాల్‌, వెంకటరాముడు, ఆదిశేషులు, నాగరాజు, ఆశ్వర్థ, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.