ప్రజాశక్తి-రాయచోటి : పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సజావు నిర్వహించేందుకు నియమించిన నోడల్ అధికారులు వారి విధులను సమర్థ వంతంగా నిర్వహించాలని కలెక్టర్ గిరీష పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 13 నిర్వహించనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో భాగంగా మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్, మెటీరియల్, ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్లకు సంబంధించి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, రిసెప్షన్ అండ్ డిస్ట్రిబ్యూ షన్, రిపోర్టింగ్ సెల్, డైలీ రిపోర్ట్స్, వెబ్ కాస్టింగ్ తదితర అంశాలకు సంబంధించి నియమించిన నోడల్ అధికారులు వారికి కేటాయించిన విధులను మరింత బాధ్యతాయుతంగా నిర్వహించాలని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలను పటిష్టంగా నిర్వహించేందుకు పకడ్బందీ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని పోలింగ్ స్టేషన్‌లో ఎన్నికల నిబంధనల మేరకు మౌలిక వసతుల కల్పనకు పరిశీలించాలని, ఎన్నికల నిర్వహణకు మాస్టర్ ట్రైనర్లచే ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ నిర్వహించాలన్నారు. పోలింగ్‌కు అవసరమయ్యే బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుండి పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్స్‌ల తరలింపుకు తదితర అంశాలను అధికారులు సమన్వయంతో పనిచేసి తమ విధులను నిర్వర్తించాలని సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారీయా, డిఆర్‌ఒ సత్యనారాయణ, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.










