ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : గ్రామ పంచాయతీలో కార్యదర్శులు, డిజిటల్ ఆపరేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు సక్రమంగా విధులకు హాజరవుతూ లక్ష్యాలను అధిగమించేందుకు తమ వంతు కృషి చేయాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి అన్నారు. శనివారం పట్టణంలోని న్యూ ఆంధ్ర కల్యాణ మండపంలో డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి వివిధ రకాల అంశాలపై సమీక్షించారు. మండలాల వారిగా పంచాయతీ కార్యదర్శులను డిజిటల్, కంప్యూటర్ ఆపరేటర్లతో పంచాయతీలో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. కొన్ని మండలాల్లో లక్ష్యాన్ని చేరుకోకపోవడంతో వారికి పద్ధతి మార్చుకోవాలని సూచించారు. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా డిపిఒ ధనలక్ష్మి మాట్లాడుతూ ప్రతి పంచాయతీలో కుక్కలు, కోతులు లేకుండా చూడాలని తెలిపారు. అదే విధంగా 100 శాతం పన్నులను రాబట్టాలని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయరాదని, పంచాయతీల్లో ప్రత్యేక బోర్డులు పెట్టాలని చెప్పారు. ఎవరైనా పంచాయతీ అధికారులు మాట వినకుండా వారి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ చెత్త బహిరంగ ప్రదేశాల్లో వేస్తే కేసులు నమోదు చేయాలని సూచించారు. అదేవిధంగా ఇళ్లలోంచి, హోటల్లలోనూ రోడ్లపైకి మురుగు నీరు వదులుతుంటే అటువంటి వారిపై సత్వర చర్యలు తీసుకొని పారిశుధ్యం పట్ల ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకొని అంటువ్యాధులు ప్రబలకుండా సత్వర చర్యలు చేపట్టాలని తెలిపారు. ఉన్నతాధికారులు ఫోన్ చేసినప్పుడు తప్పకుండా స్పందించాలని తెలిపారు. లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.










